Pawan Kalyan Review meet with Janasena contestant leadersగుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, ఆయా స్థానాల్లో విజయావకాశాలపై సమీక్షించారు. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో తమకు ఎదురైన అనుభవాలను పవన్ కు వివరించారు. గుంటూరు నుండి చిత్తూరు వరకు ఉండే జిల్లాల అభ్యర్థులను ఈ సమావేశానికి పిలిచారు.

అయితే పోటీ చేసిన వారిలో చాలా మంది సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. తొలి విడత సమీక్షలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులతో గత నెల 22న పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అయితే రెండో దఫా సమీక్ష నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ కు దాదాపుగా 20 రోజులు పట్టిందన్నమాట. దీని బట్టి ఈ సమీక్షలపై పవన్ కళ్యాణ్ చిత్తసుద్ధి, సీరియస్ నెస్ ఏపాటిది అనేది మనకు అర్ధం అవుతుంది.

పవన్ కళ్యాణ్ కు తగ్గట్టుగానే అభ్యర్థులు కూడా వీటిని సీరియస్ గా తీసుకోవడం లేదు. మొదటి సమీక్ష తరువాత పవన్ కళ్యాణ్ స్విట్జర్ ల్యాండ్ వెళ్లి రెండు రోజుల క్రితమే వచ్చారు. ఇటీవలే మరణించిన పార్టీ ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టారు. ఎలాగూ వచ్చారు కాబట్టి సమీక్ష నిర్వహించారు. పార్టీలో ఫలితాలకు ముందే ఇటువంటి నిర్లిప్తత ఉంటే కౌటింగ్ రోజు ప్రమాదం అని విశ్లేషకులు భావిస్తున్నారు.