pawan kalyan retaliates on ys jaganరాజకీయంగా తన అన్నతో విభేదించి మరీ తాను ‘జనసేన’ ఏర్పాటు చేసానని, గతంలో చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే పవన్ ది, నాది ఒకే దారి గానీ, దానిని తీసుకునే విధానం మాత్రం వేర్వేరుగా ఉంటాయని ఇటీవల అభిమానుల సమక్షంలో చిరు ఉదహరించారు. రాజకీయంగా ఎలాంటి వైవిధ్యం ఉన్నా, కుటుంబ పరంగా మాత్రం ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారని చాలా సందర్భాలలో నిరూపణ అయ్యింది.

కానీ ఈ ఇద్దరిలోనూ ఓ కీలక వ్యత్యాసం గమనించవచ్చు. చిరంజీవిని ఓ చిన్న మాట ఎవరు అన్నా, దానిని తట్టుకోలేక ఏదొక సందర్భంలో వారిపై సెటైర్లు, పంచ్ లు వేసి బహిరంగంగానే తన సోదరుడిపై ఉన్న అభిమానాన్ని పవన్ తెలియజేస్తుంటారు. కానీ చిరంజీవి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పవన్ కళ్యాణ్ ను గానీ, ఆమె కూతురుని అనరాని మాటలు అన్నా, ఒక్కసారి కూడా పల్లెత్తు మాట ఎత్తి వారిని విమర్శించరు.

నేడు నరసాపురంలో జరిగిన వేడుకలో ఇటీవల తాడేపల్లి నివాసంలో జగన్ మరియు చిరంజీవి బృందం నడుమ జరిగిన సమావేశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు జనసేన అధినేత. “ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే, ఆయన ముందుకు వచ్చి… జగన్ గారు ప్లీజ్ ప్లీజ్ మీరు మాకు చేయాలి సార్… చేయాలి సార్… అంటూ ఇలా అనాలి” అంటూ పలికించిన హావభావాలు నాటి చిరంజీవి ఉదంతాన్ని గుర్తుకు తెచ్చాయి.

అలా అంటే… వారి ఈగో తృప్తి చెందుతుంది. ‘బాగుంది… తృప్తిగా ఉంది, తగ్గారు నా దగ్గర అందరూ’ అని అంటూ జగన్ ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేసారు పవర్ స్టార్. ఇదేమైనా రాచరికమా? అంటూ ప్రశ్నించిన పవన్, మీకే ఇంతలా ఉంటే, స్వాతంత్య్ర యోధుల స్ఫూర్తిని నింపుకున్న మాకు ఎంత తెగింపు ఉంటోందో తెలుసా? భరిస్తున్నాం, భయంతో కాదు, సహనంతో… అంటూ జగన్ తీరుపై మండిపడ్డారు.

ఇల్లు కూల్చేస్తాం, రేషన్ కార్డులు తీసేస్తాం అంటూ బెదిరిస్తున్నారని, ఇలాంటి విధివిధానాలతో అలిసిపోయామని, ఒంగి ఒంగి దండాలు పెట్టడం తన వల్ల అయ్యే పని కాదని, తల వంచను అవసరమైతే తల తెగిపడు గాక అంటూ జనసైనికులను ఉత్సాహపరిచే విధంగా తనలోని చిత్తశుద్ధిని చాటుకునే విధంగా ప్రసంగించారు జనసేన అధినేత.

నిజానికి చిరు అలా దండం పెట్టిన వైనంపై అన్ని వర్గాల నుండి జగన్ అండ్ కోపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. పవన్ కూడా దాచుకోలేక జగన్ అండ్ కోకు కౌంటర్ ఇచ్చేసారు. కానీ పవన్ కళ్యాణ్ కూతురుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానితో కలిసి అదే మీటింగ్ లో చిరంజీవి కూర్చోవడం మాత్రం జనసైనికులకే కాదు, సాధారణ వ్యక్తులకు కూడా జీర్ణించుకోలేని అంశంగా మారింది. కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించే ధైర్యం కూడా చిరు చేయలేకపోయారు.