Pawan Kalyan Response Baahubali 2 Movie Twitterప్రస్తుతం ఏ నోట విన్నా… ‘బాహుబలి 2’ సినిమా ప్రస్తావన తప్ప మరొక విషయం లేదు. సినీ అభిమానులైతే ఎలా ఉంది అని పలకరించుకోవడం కన్నా? ఎన్ని సార్లు చూసారు? అని మాట్లాడుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అయితే… ఈ సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియాలో తమ ఖాతాల ద్వారా ‘బాహుబలి 2’పై మరియు దర్శకుడు రాజమౌళిపై మరియు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.

అయితే అందరూ చెప్తున్న ఏకైక అభిప్రాయం… ‘బాహుబలి 2’ అనేది తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం..! మరి అంతటి గర్వకారణమైన సినిమాపై ప్రస్తుత స్టార్ హీరోలైన మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కూడా నిస్పక్షపాతంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. కానీ, ఒక్క వ్యక్తి మాత్రం ‘బాహుబలి 2’ ఊసెత్తకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు… మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లకు సమకాలీకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!

తెలుగు సినిమా ఖ్యాతిని విస్తరింపచేసిన సినిమాగా నిలిచిన “బాహుబలి”పై పవన్ ఇంతవరకు స్పందించలేదు. నిజానికి పవన్ వ్యవహారశైలి కూడా ఇందుకు విరుద్ధం అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్నో దశాబ్దాలకు గానీ ‘బాహుబలి’ లాంటి సినిమా ఒక్కటి రాదు. ముందు తరాలకు ‘దానవీరశూరకర్ణ’ వంటి పౌరాణిక సినిమాలు ఎలా నిలిచాయో, ఈ తరానికి ‘బాహుబలి’ వంటి ఒక్క సోషియో ఫాంటసీ సినిమా అలా నిలిచింది. మరి అంతటి ఖ్యాతిని దక్కించుకున్న సినిమాపై… ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా, టాప్ హీరోగా పవన్ కూడా తమ అభిప్రాయం తెలియజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం సినీ జనాల్లో వ్యక్తమవుతోంది.

నిజానికి ‘బాహుబలి’ మేనియా సినీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాను వీక్షించి అభినందనలు తెలిపారు. మరి సినీ, రాజకీయ రంగంలో ఉన్న పవన్ కళ్యాణ్ పెదవి విప్పకపోవడంతో, ఏదైనా ట్వీట్ వస్తుందేమోనని పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో ట్విట్టర్ ఖాతా వైపుకు చూస్తున్నారు. ఒకవేళ పవన్ నుండి ట్వీట్ వస్తే… “బాహుబలి 2” సినిమాకు అది మరింత ‘స్పెషల్’ అనే చెప్పాలి. ఎందుకంటే… ఇప్పటివరకు తన సినిమాల గురించి కూడా పవన్ ఎప్పుడూ ప్రస్తావించలేదు. మరి ఆ క్రెడిట్ ‘బాహుబలి 2’కు దక్కుతుందో లేదో చూడాలి.