Pawan Kalyan  జనసేన పార్టీ పంచాయతీ ఎన్నికల విషయంలో ఏదేదో చెప్పుకున్నా… ఇటీవలే జరిగిన మునిసిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగడంతో ఆ పార్టీ పరిస్థితి అర్ధమైపోయింది. 2019తో పోలిస్తే పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. అయితే వాస్తవాలను పవన్ చూడలేకపోతున్నారో లేక చూడకూడదు అనుకుంటున్నారో గానీ మళ్ళీ ఏవేవో లెక్కలు చెబుతున్నారు.

తమ పార్టీకి మునిసిపాలిటీలలో 14.86%, కార్పొరేషన్లలో 13.48% వచ్చిందని చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం మునిసిపాలిటీలలో జనసేనకు వచ్చింది 4.67%. మిత్రపక్షం బీజేపీకి వచ్చిన 2.41% కలుపుకున్నా పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్కలకు దగ్గరగా కూడా రావు.

ఎన్నికలలో ఎక్కడ తప్పు జరిగింది అనే చర్చ జరగకుండా ఈ తప్పుడు లెక్కలతో ఏమీ ఉపయోగం? ఎదురుగా ఉన్న వాస్తవాలను విస్మరిస్తే ఇక పార్టీ ఎలా బలోపేతం ఎలా అవుతుంది? ఇది ఇలా ఉండగా… ముప్పై ఐదు శాతం ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారని, అందువల్ల దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ విజయంగా చూడడం లేదని ఆయన అన్నారు.

సాధారణ ఎన్నికలలో కూడా ఎప్పుడూ 100% ప్రజలు ఓటు వెయ్యరు. ప్రతీ ఎన్నికలలో ఎంతో కొంత శాతం ప్రజలు ఓటింగు కు దూరంగా ఉండటం సహజం. నిర్బంధ వోటింగ్ ఉంటే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. వాస్తవాలను ఒప్పుకుని ఎక్కడ తప్పు జరిగింది అనేదాని మీద చర్చ జరిపి ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూనే రాజకీయాలలో ముందుకు వెళ్ళగలం. ఆత్మవంచన వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.