Pawan Kalyan respondson Rapaka Vara Prasada Rao  arrestజనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్‌స్టేషన్‌ కేసులో ఆ పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కాసేపటి క్రితం పోలీసులకు లొంగిపోయారు. ఆయనను కాసేపటి తరువాత కోర్టులో ప్రవేశపెడతారు. కేసు వివరాల్లోకి వెళ్తే … మలికిపురంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ఆదివారం రాత్రి ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు ఎమ్మెల్యే అనుచరుడు. అతనిని విడిచిపెట్టాలని పోలీసులను ఒత్తిడి చేశారు.

అయితే వారు వినకపోవడంతో, ఎమ్మెల్యే స్టేషన్ ఎసై తనను దూషించాడని ఆరోపించడం తో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి కిటికీ అద్దాలు పగలగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారంటూ ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు పోలీసులు సోమవారం చింతలమోరిలోని రాపాక ఇంటికి వెళ్లారు. దీనితో అరెస్టు తప్పదని ఆయన లొంగిపోయారు. అయితే తన ఎమ్మెల్యేను పవన్ కళ్యాణ్ వెనకేసుకుని వచ్చారు.

“ప్రజల తరఫున పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదు. ప్రజలు అడిగితే వారికి మద్దతుగా వరప్రసాద్‌ వెళ్లారు.. అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టడమేంటి? నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడితే ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదు?. గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చారని వ్యాఖ్యానించారు. ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికార యంత్రాంగం పరిష్కరించాలి. అప్పటివరకూ జనసేన కార్యకర్తలు, నాయకులు సంయమనంతో ఉండాలి. పరిస్థితి అదుపుతప్పి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన పక్షంలో నేనే స్వయంగా వస్తా,” అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.