Renu Desai -Pawan Kalyanతన మాజీ భార్య రేణుదేశాయ్ రెండో వివాహాన్ని ఉద్దేశించి, ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ పరోక్షంగా అభిమానులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసారు. అయితే అభిమానులు పవన్ కళ్యాణ్ కంట్రోల్ లో లేరన్న విషయం మరికొద్ది గంటలకే స్పష్టం అయ్యింది. గడిచిన రెండు రోజులుగా ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు రేణును ఉద్దేశిస్తూ అసభ్యకరంగా మరియు జుగుప్సాకరమైన రీతిలో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి దీనిని కంట్రోల్ చేద్దామనే పవన్ స్వయంగా ట్వీట్ వేసారు. అయినప్పటికీ తమ అభిమాన హీరో వ్యాఖ్యలు కూడా లెక్క చేయకుండా రేణుపై విరుచుకుపడడంతో, ఏకంగా ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేశారు. పవన్ అభిమానులని ప్రత్యేకంగా పేర్కొనలేదు గానీ, వెళ్తూ వెళ్తూ… ఫైనల్ గా ఒక సందేశాన్ని ఇచ్చి కూడా వెళ్ళారు. “ట్విట్టర్‌లో విపరీతమైన నెగిటివిటీ నిండి ఉందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ ఉండే వాళ్లు అధికంగా అజ్ఞాత వ్యక్తులు, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చిరాకుతో ఉన్న వాళ్లు.

ఒక సినిమా గురించి కానీ, రాజకీయ వ్యక్తుల గురించి కానీ, ఎప్పుడూ నెగిటివ్‌గా రాయడానికే ఇష్టపడతారు. నేను ఒక నూతన జీవితం ప్రారంభిస్తున్నాను. ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నా ట్విట్టర్‌ ఖాతాను డీయాక్టివేట్‌ చేసి, ఈ నెగిటివిటీకి దూరంగా ఉండదలుచుకున్నాను. అదే సమయంలో నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని రేణూ దేశాయ్ పేర్కొంది.

ఈ పర్యవసానాలతో అర్ధమైన విషయం ఏమిటంటే… తాను ఏం చెప్తే అభిమానులు తూచ తప్పకుండా అదే చేస్తారని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కు షాకింగ్ అని చెప్పవచ్చు. రేణుదేశాయ్ ట్విట్టర్ వదిలివెళ్ళిపోవడం అనేది ప్రత్యక్షంగా పవన్ కు సంబంధం లేకపోయినా… ‘జనసేనకు ఓట్లు వేయండి’ అంటూ ఇచ్చిన పిలుపును కూడా పట్టించుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తే, అభిమానులను నమ్ముకుని నడిపిస్తోన్న పార్టీ పరిస్థితి ఏం కానూ? ఆ పార్టీ అధినేత పరిస్థితి ఏం కానూ?!