pawan-kalyan-raj-bhavan-kcr-telanganaగణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో శనివారం సాయంత్రం ఎట్‌ హోం కార్యక్రమం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ తేనీటివిందు ఏర్పాటు చేశారు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటిలానే గవర్నర్ తో ఉన్న వివాదాల కారణంగా డుమ్మా కొట్టారు.

మరోవైపు ఈ విందులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్‌ పక్కనే పవన్ కల్యాణ్ కూర్చున్నారు. మరోవైపు కేటీఆర్‌‌.. కూడా పవన్‌ పక్కనే ఉన్నారు. అటు సీఎం.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ కాసేపు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇలా కేటీఆర్‌‌తో.. కేసీఆర్‌ ఇద్దరితో సుమారు అరగంటకు పైగా పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విజువల్స్ టీవీలలో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి.

తెలంగాణ ఎన్నికలలో వేలు పెట్టి తెరాసను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరిట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా అని మాట ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కూడా వచ్చే ఎన్నికలలో చంద్రబాబుని ఇరుకున పెట్టడానికి ఏమైనా టిప్స్ ఇచ్చారేమో? అయితే తెరాసతో జగన్ కలవడం ఏదో తప్పు అన్నట్టు పవన్ కళ్యాణ్ బయట మాట్లాడటం విశేషం.

గతంలో ఉద్యమం సమయంలో కేసీఆర్ తరచుగా తెలంగాణ కోసం గొంగళి పురుగుని ముద్దు పెట్టుకోవడానికైనా సిద్ధం అని అంటుండేవారు. ఇప్పుడు చంద్రబాబుని గద్దె దింపడానికి ఎవరికైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నారు కేసీఆర్. మరోవైపు ఫిబ్రవరి 14న అమరావతిలో జగన్ ఇల్లు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గృహప్రవేశానికి కేసీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొననున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా వారు ఏకాంతంగా చర్చలు జరిపే అవకాశం ఉంది.