Pawan Kalyan Questions Government About Polavaramతన అభిప్రాయాలను, భావాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలోని మూలలంక మరియు అమరావతి ప్రాంతంలోని కృష్ణానదీ లంక భూముల రైతుల వ్యధలకు సంబంధించిన ట్వీట్లు చేసారు. “రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ కు క్షేమం కాదని, 207 ఎకరాల మాగాణి భూములను రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంతవరకూ సబబని” ప్రశ్నించారు.

తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్ స్ట్రాయ్, పోలవరం కాంట్రాక్టును పొంది, రైతుల భూమిని డంపింగ్ యార్డు చేసేసిందని, కనీస వివేకాన్ని కూడా ప్రజా ప్రతినిధులు చూపడం లేదని, వారిని చూసి ఏమనుకోవాలని ప్రశ్నించారు. పోలవరంపై నెలకోసారి సమీక్ష జరుపుతున్న ప్రభుత్వం ఈ సమస్యపై ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారని, అన్యాయం జరుగుతోందని చెప్పుకోవడానికి వస్తుంటే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు.

అలాగే అమరావతిలోని కృష్ణానది లంక భూముల రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో దళితులు అయినందువలనే, వివక్షకు గురవుతున్న ఆవేదన సదరు ప్రాంత రైతుల్లో ఉందని, ఇది సమాజానికి మంచిది కాదని అభిప్రాయ పడ్డారు. అయినా గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చెప్పరాదని, మరి ఇందుకు అనుమతులు తీసుకుందో లేదో గానీ… ముందు రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే సదరు భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టని పక్షంలో ఆ భూములను రైతులకే వదిలేయాలని డిమాండ్ చేసారు.