Pawan - Kalyan - Sunil Deodhar
పరిస్థితి ఏదైనా రాజకీయ పార్టీలు తమ పాత్ర తాము పోషిస్తాయి. అధికార పార్టీలు సమర్ధవంతంగా పని చేసి ప్రజల అభిమానం పొందాలని చూస్తే, ప్రతిపక్షాలు ప్రభుత్వాలు చేసే తప్పులు ఎత్తి చూపుతాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల కోసం తమ పరిధిలో తాము పని చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాయి.

ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితిలోనైనా రాజకీయ పార్టీలు తమను తాము ఏదో విధంగా ప్రమోట్ చేసుకుంటాయి. అయితే ఈ విషయంలో జనసేన అభిమానులు మాత్రం చాలా నిరాశగా ఉన్నారు. ఏ ముహూర్తంలో జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయో గానీ అప్పటి నుండి పవన్ కళ్యాణ్ బీజేపీ నామస్మరణ చేస్తున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ చిన్న పని చేసినా దానికి సంబంధించిన బీజేపీ జాతీయ నాయకుల ట్వీట్లు అన్నీ వరుస పెట్టి రీట్వీట్ చేస్తున్నారు పవన్. జనసేన కంటే బీజేపీనే ఎక్కువ మోస్తున్నారు. ఇది జనసేన సమర్ధకులకు అసలు మింగుడుపడుతున్నారు. అసలు మనం పొత్తు పెట్టుకున్నామా లేక బీజేపీలో విలీనం అయ్యామా అని కొందరు కోపంగా ప్రశ్నించడం గమనార్హం.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ లోని పరిస్థితి పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై పవన్ స్పందించారు. అక్కడ అవసరం లేకపోయినా ఆ పిటిషన్ ఒక బీజేపీ నాయకుడు వేశారని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా ప్రతీదానికి అవసరం లేకపోయినా బీజేపీ భజన చెయ్యడం ఎందుకు అని జనసైనికులే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సామాన్యులపై ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అని వారు ఆందోళన చెందుతున్నారు.