Pawan Kalyan Press meet after meeting with Narendra Modi ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకొని ఐఎన్ఎస్ చోళలో బస చేశారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా ఏపీ బిజెపి కోర్ కమిటీతో సమావేశం అవ్వాలనుకొన్నారు. కానీ అప్పటికే కాస్త ఆలస్యం అవడంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌లతో సుమారు అర్ధగంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో నెలకొన్న అరాచక పరిస్థితులు, దేవాలయాల కూల్చివేతలు, ప్రతిపక్షాలపై అధికార వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు, నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులు, గత నెల విశాఖ వచ్చినప్పుడు పోలీసులు తనను రెండు రోజులు హోటల్‌ గదిలో నిర్బంధించడం తదితర విషయాలన్నిటినీ ప్రధాని నరేంద్రమోడీకి వివరించమని సమావేశం అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మీడియాకు తెలిపారు.

ఏపీలో నెలకొన్న అరాచక పరిస్థితుల గురించి వివరిస్తున్నప్పుడు, ఏపీలో జరుగుతున్నా పరిణామాలన్నీ తాను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూనే ఉన్నానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలనేదే తమ అభిమతమని ప్రధాని నరేంద్రమోడీ తమకు చెప్పినట్లు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.

తాము తెలియజేసిన సమాచారం మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకొంటుందని, అది ఆంధ్రప్రదేశ్‌ మేలు చేస్తాయని భావిస్తున్నామని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీతో వారి భేటీకి సంబందించి జనసేన పార్టీ ట్విట్టర్‌లో కూడా ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది.

కిందటి నెల పవన్‌ కళ్యాణ్‌ వచ్చినప్పుడు ఆయనతో చాలా దారుణంగా ప్రవర్తించిన పోలీసులే ఇప్పుడు సగౌరవంగా ఆయన తోడ్కొని ప్రధాని నరేంద్రమోడీ వద్దకు తీసుకువెళ్లాల్సి రావడం గమనిస్తే పరిస్థితులు ఎప్పుడైనా తారుమారు అవుతాయని స్పష్టం అవుతోంది. జనసేన, టిడిపిలు ఎక్కడ పొత్తులు పెట్టుకొంటాయో అని పవన్‌ కళ్యాణ్‌ని నిత్యం సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అవహేళన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే పవన్‌ కళ్యాణ్‌ని ప్రధాని నరేంద్రమోడీ పిలిపించుకొని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కనుక ఆయనను చాలా తక్కువగా అంచనా వేస్తూ వైసీపీ నేతలు చాలా పొరపాటు చేస్తున్నారని స్పష్టం అయ్యింది.

ప్రధాని నరేంద్రమోడీ-పవన్‌ కళ్యాణ్‌ భేటీతో కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోవచ్చు. కానీ తప్పకుండా ఏపీ బిజెపి వైఖరిలో మార్పు వస్తుంది. ఇక నుంచి ఏపీ బిజెపి జగన్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడే అవకాశం ఉంది. మరికొద్ది సేపటిలో ఆంద్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్రమోడీ బహిరంగసభ జరుగబోతోంది. దానిలో సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు కనుక జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవచ్చు. కానీ ఏపీ బిజెపి నేతలకి నిన్న రాత్రి దిశానిర్దేశం చేశారు కనుక త్వరలోనే వారి పోరాటాలు మొదలవవచ్చు.