Pawan Kalyan poor campaign in Gajuwakaజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేస్తున్నరు. 2009లో చిరంజీవి తిరుపతి, పాలకొల్లులో పోటీ చేసి.. తిరుపతిలో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు… రెండు స్థానాలలో విజయఢంకా మోగించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. పవన్‌ సామాజిక వర్గం ఓట్లు భీమవరం నియోజకవర్గంలో 70 వేలకు వరకూ ఉన్నాయి.అదే విధంగా గాజువాకలో 55 వేల వరకూ ఉన్నాయి.

దీనితో పాటు రెండు చోట్ల పవన్‌ మద్దతుదారులూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎన్నికలలో వీరే కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. 2009లో గాజువాకలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే రెండు చోట్లా పవన్ కళ్యాణ్ స్థానికంగా ఉండరు అనే దాని మీదే ప్రత్యర్ధులు ఫోకస్ పెడుతున్నారు. రెండూ గెలిస్తే ఇక్కడ రాజీనామా చేస్తారంటే ఇక్కడ రాజీనామా చేస్తారు అంటూ ప్రచారం చేసి ఆయనకు ఓట్లు పడకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తుండడంతో రెండు చోట్లా ప్రచార కార్యక్రమాల నిర్వహణ పెద్దగా సాగడం లేదనే చెప్పుకోవాలి. పెద్ద నేతలు ఎవరూ లేకపోవడంతో అభిమానులు ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. గాజువాకకు చెందిన జనసేన నేత కోన తాతారావును విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పంపడం, గాజువాక ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన చింతలపూడి వెంకటరామయ్యను పెందుర్తి అభ్యర్థిగా నిలపడంతో పవన్‌ తరఫున ప్రచారం చేసే వారు లేరు.

భీమవరంలో కూడా అదే పరిస్థితి. అయితే నరసాపురం పార్లమెంట్ పరిధిలో అన్న నాగబాబు పోటీ చెయ్యడం, ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీకి పని చేసిన అనుభవం ఉండటంతో కొంత మేర పరిస్థితిలు బెటర్ గా ఉన్నాయి. అయితే ఈ విషయంగా అధినేత తొందరగా దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటి పరిస్థితి ఎలా ఉన్నా ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు చెప్పటాల్సిన పనులకు సరైన నేతలు లేకపోతే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.