Pawan Kalyan Jana Sena Coordinators selectionరాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ‘జనసేన’ అధినేత ప్రభావం పెద్ద స్థాయిలోనే ఉందన్నది జగమెరిగిన సత్యం. మంత్రులు మీడియా మీట్ లలో చెప్పినా పరిష్కారం కానటువంటి సమస్యలపై పవన్ కళ్యాణ్ ఒక్క ట్వీట్ చేస్తే చాలు… దానికి సత్వరం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, తగు విధంగా సమస్యను ఒక కొలిక్కి తీసుకువస్తోంది.

కానీ ఈ సారి పవన్ టార్గెట్ చేయబోతున్నది రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్య కాదు, బిజెపి ఆధ్వరంలోని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమస్యపై పవన్ బరిలోకి దిగుతున్నాడు. దీంతో సమస్య పరిధి పెరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… విశాఖ‌ప‌ట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా కార్మిక సంఘాలు కొన్ని నెల‌లుగా నిర‌స‌న తెలుపుతున్నాయి.

కేంద్ర‌ ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో డీసీఐ ఉద్యోగి వెంకటేష్ విజయనగరం జిల్లా నెర్లిమర్లలో అత్మహత్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ రోజు ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిర‌స‌న‌గా బుధవారం నుండి వారు స‌మ్మెకు దిగే యోచనలు చేస్తున్నారు.

ఇదే విషయమై గ‌తంలో డీసీఐ ఉద్యోగులు హైద‌రాబాద్‌ కి వ‌చ్చి పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించారు. ఈ విష‌యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఉద్యోగుల పక్షాన నిలబడాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ విజ్ఞ‌ప్తి చేశారు. అయితే తాజాగా వెంక‌టేష్ ఆత్మ‌హ‌త్య‌తో ఆందోళ‌న‌ ఉద్ధృతంగా మారడం, కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోక‌పోవడంతో బుధవారం ప‌వ‌న్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.

డీసీఐ ఉద్యోగుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌నున్న పవన్, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంక‌టేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌నున్నారు. విశాఖ‌ప‌ట్నంతో పాటు విజ‌య‌న‌గ‌రంలోనూ మొత్తం మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప‌ర్య‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా ‘జనసేన’ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తోనూ స‌మావేశం అవుతారు. నష్టాలలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలిసిందే.