Pawan Kalyan on Jallikattu Tamilians (1)“జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తిదాయకం” అంటూ తమిళులు సాధించిన విజయాన్ని అభినందిస్తూ… ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే పార్టీ పరంగా ప్రెస్ కు కూడా ఒక లేఖను పంపించారు. తమిళులు చూపించిన పోరాట పటిమ తెలుగు వారు కూడా ‘ప్రత్యేక హోదా’ సాధించడంలో చూపించాలన్నది ఈ లేఖలోని అసలు సారాంశం. అయితే ఇందులో ఓ పెద్ద తప్పు దొర్లినా… అది గమనించకుండా పవన్ సంతకం చేయడం నెటిజన్ల విమర్శలకు కారణమైంది.

సదరు లేఖలోని మొదటి పేరాగ్రాఫ్ లో… ‘కులమతాలకు అతీతంగా తమిళులంతా ఏకమై జల్లికట్టుకు “వ్యతిరేకంగా” నినదించడం స్ఫూర్తిదాయకం’ అన్న పొరపాటును గమనించకుండా పవన్ సంతకం చేసి ప్రెస్ కు విడుదల చేసారు. అలాగే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలో కూడా అలాంటి పొరపాటే ఉంది. జల్లికట్టు కోసం పోరాడిన ఘనత తమిళులది కాగా, జల్లికట్టుకు వ్యతిరేకంగా అని లేఖలో ఉన్న పొరపాటును గమనించకుండా పవన్ సంతకం చేయడంతో… సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు.

ఒక పార్టీకి అధినేత అయ్యి ఉండి, అంత బాధ్యతారాహిత్యంగా ఎలా సంతకం పెడతారు? అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ చిన్న పొరపాటే పవన్ లోని చిత్తశుద్ధిని చాటిచెప్తోందని, రాజకీయ నాయకులను విమర్శిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై ఉన్న ఫోకస్, అసలు విషయాలపై ఉండడం లేదని మండిపడుతున్నారు. సినిమాలలో బిజీగా ఉంటే, సినిమాలే చేసుకోవాలి తప్ప ఇలా ప్రజా జీవితంలో అర్ధాలు మారిపోయేలా చేయకూడదు అన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న విషయం.

జరిగిన పొరపాటు తెలుగు ప్రజల రీత్యా చిన్నదే కావచ్చు, కానీ తమిళులకు మాత్రం చాలా పెద్దదన్న విషయం జరిగిన ఉద్యమమే చెప్తోంది. అయితే ‘ఒక్క పదం’తో అసలు అర్ధమే మారిపోవడంతో, ఇలాంటి విషయాలలో మున్ముందు అయినా పవన్ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు, సలహాలు ఓ రేంజ్ లో వస్తున్నాయి. ‘దూకుడు’ సినిమాలో మహేష్ చెప్పిన… ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతానన్న డైలాగ్ ను బహుశా నిజజీవితంలో పవన్ అవలంభించేస్తున్నారేమో..!