Pawan Kalyan on corruption leaders in janasenaనిన్న రావులపాలెం రోడ్డు షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన మాట అన్నారు. ‘చాలామంది అవినీతిపరులు జనసేనలో చేరుతున్నారు. వాళ్లను ఎందుకు చేర్చుకుంటున్నారని ఓ కార్యకర్త నన్ను ప్రశ్నించాడు.. అవినీతి నేతలు మన పార్టీలోకి వచ్చి నీతిగా మారతారని నేను అతనికి చెప్పా’నని పవన్‌ వివరించారు. అవినీతిపరులు జనసేన పార్టీలో చేరగానే నీతిమంతులు అయిపోతారు? జనసేన ఎమన్నా పాపాలు హరించే గంగ నదా?

సాధారణంగా అన్ని పార్టీలు అవినీతి పరులైన నేతలను జేర్చుకునే సమయంలో సాధారణంగా వాడే మాట ఇదే కదా? మా పార్టీలోకి వచ్చాక మారిపోతారు? అని. వాటికి జనసేనకు తేడా ఏంటి? అసలు కొత్త రకం రాజకీయం చేస్తామని చెప్పుకుంటూ ఈ పాత నేతలను అవినీతి మకిలి అంటుకున్న వారిని చేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటి? ఈ నేతలతో కొత్త తరహా రాజకీయం ఏం చేస్తారు? ఎలా చేస్తారు? వీరితో మార్పు ఎలా సాధ్యం? ఇలా చేస్తేనే రాజకీయమంటే మేము అన్ని పార్టీలు వంటి వారిమే అని చెప్పేసుకుంటే సరి.

రేపటి నుండి ప్రతి దానికి ఇలానే వంకలు వెతుకుతారు. ప్రజలకు మంచి చెయ్యాలంటే అధికారం కావాలి… అధికారం కావాలంటే ఇలాంటి తప్పవు అంటూ అన్ని తప్పులు చేస్తారు. ఒకసారి ప్రజారాజ్యం దెబ్బకు చాలా మంది మార్పు అని వచ్చే పార్టీలను నమ్మడం మానేశారు. ఇప్పుడు జనసేన విషయంలోనూ అదే తప్పు జరిగితే ఇక వర్గం ప్రజలు రాజకీయాలనే ఈసడించుకుంటారు. అసలు ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు రారు. పవన్ కళ్యాణ్ దీని గురించి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.