pawan-kalyan-jana-sena-on-bjpవిభజన విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ చేసిన ద్రోహానికి రగిలిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‘జనసేన’ అనే రాజకీయ పార్టీని స్థాపించి… ‘కాంగ్రెస్ హటావో… దేష్ బచావో…’ అనే నినాదాన్ని వినిపించి, బేషరతుగా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలిపిన సంగతులు తెలిసినవే. సరిగ్గా ఇవే విషయాలను ప్రస్తావిస్తూ… ఓ అయిదు అంశాలపై బిజెపిని ప్రశ్నించాలనుకుంటున్నట్లుగా ట్వీట్లు చేసారు.

ఆవు సంహారం, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపీ ప్రత్యేక హోదా… ఈ అయిదు అంశాలపై కేంద్ర సర్కార్ ను నిలదీసే క్రమంలో మొదటగా పేర్కొన్న ‘ఆవు సంహారం’కు సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ… బిజెపి నేతలను నిలదీశారు. నిపుణులను, సీనియర్ రాజకీయవేత్తలను, జర్నలిస్ట్ లను మరియు బిజెపికి ఓట్లు వేసిన వారితో సంప్రదింపులు జరిపిన మీదట తానూ ఈ ప్రశ్నలను సందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

సామాజిక వర్గాలలో విభేదాలు తెచ్చే విధంగా మరియు భయపెట్టే విధంగా ‘గోమాంసం’పై చేస్తున్న రాజకీయ మెళకువలను ప్రస్తావిస్తూ… నిజంగా బిజెపికి అంత చిత్తశుద్ధి ఉంటే బిజెపి పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వలైన గోవా మరియు ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే నిషేధం విధించి ఉండేవారని, అలాగే బిజెపి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లెదర్ తో తయారైన ఫుట్ వేర్ తదితరాలను బ్యాన్ చేయాలని కోరారు.

చివరగా… ఆవులను నిజంగా పరిరక్షించాలంటే… ప్రతి బిజెపి కార్యకర్త కూడా ఒక ఆవును తీసుకుని పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని, ఇలాంటివి ఏమైనా నిజంగా తీసుకుని ఉంటే బిజెపి నేతలు తన చిత్తశుద్ధిని, సీరియస్ నెస్ ను చాటుకునేవారని అభిప్రాయపడ్డారు. ఇలా’ గోమాంసం’పై తన అభిప్రాయం చెప్పిన పవన్ కళ్యాణ్, రెండవ ఉదంతం అయిన ‘రోహిత్ వేముల ఆత్మహత్య’పై మరుసటి రోజు స్పందిస్తానని తెలిపారు.

అయితే ‘జనసేన’ అధినేత వ్యాఖ్యలు చూస్తుంటే… బిజెపిపై ఖచ్చితంగా ఒక ‘స్టాండ్’ తీసుకున్నట్లుగా కనపడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలకు చేస్తోన్న అన్యాయాల పట్ల నిలదీయాలనే దృక్పధం పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టంగా గోచరిస్తోంది. గత ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలుపుతూ ‘జనసేన’ తీసుకున్న నిర్ణయానికి, పవన్ ‘యు టర్న్’ తీసుకున్నారని ఈ వ్యాఖ్యలు చెప్పకనే చెప్తున్నాయి.