pawan kalyan now you have to understandజగన్ – చిరంజీవిల భేటీ వార్తలను తెలుగు మీడియా సాధారణంగానే ప్రసారం చేసింది. కానీ నేడు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో మాత్రం చిరంజీవికి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసారంటూ ఓ ప్రత్యేకమైన కోణంలో దీనిని ప్రతిబింభించింది. దీంతో సహజంగా అసలు టాపిక్ పక్కకు వెళ్లి, చిరంజీవిపై విమర్శలు వెలువడ్డాయి.

ఎప్పటి మాదిరి కాకుండా ఈ సారి త్వరగానే మేల్కొని చిరంజీవి ఈ విషయాన్ని ఖండిస్తూ తాజాగా ట్వీట్స్ చేసారు. సమస్యను పక్కదారి పట్టించే విధంగా ఉన్నవిగా చెప్పిన చిరు, ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలుగా చెప్పడమే కాకుండా, ఇకపై రాజకీయాల్లోకి వచ్చేది లేదని కూడా స్పష్టత ఇస్తూ, ఇక ఈ వార్తలకు శుభంకార్డు వేయాలని కోరారు.

తనకు మరియు జనసేనకు డామేజ్ జరగకముందే చిరంజీవి ఈ విషయం చెప్పడం మంచి విషయం. అయితే ఈ వార్తలను ప్రసారం చేసిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఉద్దేశం ఏమిటి? దీని వెనుక ఎవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిని జనసేన అధినేత పవన్ పూర్తిగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేవలం కాపు కమ్యూనిటీ టార్గెట్ గానే సరికొత్త రాజకీయాలకు ఏపీ నిలయం అవుతున్న నేపధ్యంలో… మారుతోన్న రాజకీయాలను అవపోసనం చేసుకుని జనసేన అధినేత అడుగులు వేయాలి. లేని పక్షంలో ఓ వర్గం చేస్తోన్న ప్రచార ‘ట్రాప్’లో జనసేన అండ్ కో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తాజాగా ఉదంతం చెప్పకనే చెప్తోంది.