Pawan Kalyan - TV9గతంలో తన తల్లిని శ్రీరెడ్డితో తిట్టించారని పవన్ కళ్యాణ్ టీవీ9 పై చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. టీవీ9 ఓనర్ శ్రీని రాజు, సీఈఓ రవి ప్రకాష్ పై అప్పట్లో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. అప్పటి నుండి టీవీ9 జనసేన కు సంబందించిన వార్తలను పూర్తిగా పక్కన పెట్టేసింది. పవన్ కళ్యాణ్ స్పీచ్లను, జనసేన కార్యక్రమాలను పూర్తిగా బ్లాక్ అవుట్ చేసేసింది. జనసేన కూడా టీవీ9కు వీలైనంతగా దూరంగానే వ్యవహరిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు టీవీ9లో పరిణామాలు మారిపోయాయి.

టీవీ9 మానేజిమెంట్ మారింది, రవి ప్రకాష్ ను బయటకు పంపింది. వెంటనే టీవీ9 పట్ల పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, పవన్ కళ్యాణ్ పట్ల టీవీ9 శైలి మార్పు రావడం విశేషం. నిన్న నంద్యాల వెళ్లి ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో టీవీ9 లోకల్ రిపోర్టర్ కు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల గురించి, జనసేన అవకాశాల గురించి, భీమవరం – గాజువాకలో తనకు వచ్చే మెజారిటీ గురించీ పవన్ కళ్యాణ్ క్లుప్తంగా మాట్లాడారు.

దీనితో టీవీ9 కొత్త మానేజిమెంట్ కు జనసేనానికు సయోధ్య కుదిరింది అనే చెప్పుకోవాలి. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కాసేపటి క్రితం సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, ఆయా స్థానాల్లో విజయావకాశాలపై సమీక్షిస్తున్నారు. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో తమకు ఎదురైన అనుభవాలను పవన్ కు వివరించారు.