Pawan Kalyan New political strategy‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలకు కనిపించి దాదాపుగా ఒక మాసం రోజులు కావస్తోంది. కానీ నేడు నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గరకు చేరుకొని రొట్టెల పండగలో పాల్గొననున్నారు. అలాగే యాత్రల డేట్ లను కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న జనసేన అధినేత, మళ్ళీ వెలుగులోకి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే… ‘ఆపరేషన్ డైవర్షన్’లో భాగంగా బాబు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే రోజు పవన్ పోలవరం వెళ్లి విమర్శలు చేయడానికే పవన్ రంగంలోకి దిగుతున్నారని తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు.

ఈ నెల 25వ తేదీన ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉన్న నేపధ్యంలో… జాతీయ స్థాయిలో బాబుపై ఫోకస్ పడింది. దీనిని డైవర్ట్ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బిజెపి అధిష్టానం మళ్ళీ రంగంలోకి దించిందని సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్ళు పవన్ అండ్ కోపై విరుచుకుపడుతున్నారు. ఈ ఆరోపణలలో వాస్తవం ఎంత ఉన్నా… పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు మాత్రం సదరు ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

గతంలో కూడా కేంద్రంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్న సమయంలోనే పవన్ విరుచుకుపడడం, అలాగే జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు, లోకేష్ లు అవినీతి చేసేసారంటూ మండిపడడం… ఇలా చంద్రబాబు జాతీయ స్థాయిలో హల్చల్ చేస్తున్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి, తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడం అలవాటైపోయింది. దీంతో ఒక రకంగా తెలుగు తమ్ముళ్ళు ఆరోపణలు చేసే అవకాశాన్ని స్వయంగా పవన్ కళ్యాణే కల్పిస్తున్నట్లవుతోంది.