Pawan Kalyan Nenu Manam Janamమాటలతో చెప్పలేని అనేక విషయాలను పేపర్ పైన పెట్టవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇదే చేస్తున్నారు. తానూ చేయబోతున్న రాజకీయాలపై బహిరంగ సభలలో, మీడియా ఇంటర్వ్యూలలో సరైన స్పష్టత ఇవ్వలేని పవన్ కళ్యాణ్… తాజాగా మరో పుస్తక రచనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే “ఇజం” అనే పుస్తకాన్ని రచించి, ఎవరికీ అర్ధం కాని విధంగా రాసారంటూ విమర్శల పాలైన పవన్ కలం నుండి మరో పుస్తకం కాబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

“నేను… మనం… జనం…” పేరుతో రచించబోతున్న ఈ పుస్తకంలో ‘అసలు రాజకీయాలు ఎలా ఉండాలి?’ అన్న అంశంపై అక్షరాలను కలిపేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ‘ఆ రాజకీయాలలో తను ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నాడు’ అన్న విషయంపై కూడా స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారట. ఇంకో రకంగా చెప్పాలంటే… ‘జనసేన’ పార్టీ సిద్ధాంతాలను ఈ పుస్తకం ద్వారా ప్రజలకు తెలియజేయాలని సంకల్పించినట్లుగా తెలుస్తోంది.

ఓ పక్కన ‘కాటమరాయుడు’ సినిమా చేస్తూనే, మరో పక్కన ఈ పుస్తక రచన పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నారట. రాబోయే రెండు మాసాల సమయంలో ఈ పుస్తకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి, తద్వారా ప్రజాక్షేత్రంలోకి పవన్ అడుగుపెట్టే దిశగా అడుగులు వేయబోతున్నారనేది లభించిన కీలక సమాచారం. ఈ “నేను… మనం… జనం…” అనే పుస్తకానికి ‘మార్పు కోసం యుద్ధం’ అనే ట్యాగ్ లైన్ ను కూడా పెట్టుకున్నారు.

అయితే ఈ ‘మార్పు కోసం’ అనే నినాదం గతంలో ‘ప్రజారాజ్యం’ ఎన్నికల ప్రచారంలో బాగా వినిపించిన సంగతి తెలిసిందే. ప్రజలలో ‘మార్పు’ తెస్తామని చెప్పిన ‘చిరంజీవి అండ్ కో’లో వచ్చిన మార్పులతో చివరికి ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. మరి ఆశయాలు, ఆలోచనల విషయంలో తన అన్నయ్యతో పూర్తిగా విభేదించే ‘జనసేన’ అధినేత పవన్ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.