Pawan Kalyan negligence JanaSena Party Symbolతెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షుడిగా ఏర్పాటైన తెలంగాణ జనసమితి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. టీజేఎస్‌కు ‘అగ్గిపెట్టె’ను గుర్తుగా కేటాయించింది. 2018 మార్చి 31న కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జనసమితి ఏర్పాటైంది. ఏప్రిల్ 29న తొలి సభను ఏర్పాటు చేసింది.

టీజేఎస్‌తోపాటు మొత్తం 15 రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. అయితే 2013 లో పెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకు మాత్రం ఎన్నికల సంఘం గుర్తుని కేటాయించలేదు. జనసేనను ఎన్నికల సంఘం ఇప్పటికే రిజిస్టర్డ్ పార్టీగా గుర్తించింది. అయితే గుర్తు కేటాయింపు ఎక్కడకి వరకు వచ్చిందో సమాచారం లేదు. తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యని కారణంగా ఇప్పటికిప్పుడు జనసేనకు వచ్చిన ఇబ్బంది లేదు.

కాకపోతే ఒక పార్టీకి కొత్తగా గుర్తు కేటాయిస్తే అది ప్రజలలోకి తీసుకుని వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి గుర్తు కేటాయింపు ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. జనసేన పార్టీ నాయకులు ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చెయ్యడం లేదో అంతు చిక్కని ప్రశ్న. గతంలో ప్రజారాజ్యం పార్టీకి కూడా చివరి నిముషం వరకు గుర్తు కేటాయింపు జరగలేదు. దానికి ఆ పార్టీ తగిన మూల్యం చల్లించింది.

ఇప్పుడు కోదండరాం పార్టీకి కూడా ఆ ఇబ్బంది తప్పట్లేదు. ఎన్నికలకు నెలన్నర కూడా లేకపోవడంతో పార్టీ గుర్తును ప్రజలలోకి తీసుకుని వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే అదే తప్పు పవన్ కళ్యాణ్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. మరోవైపు జనసేన ఇప్పటి వరకు కేవలం ఒక అభ్యర్థిని మాత్రమే ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లా లోని ముమ్మిడివరం నియోజకవర్గం నుండి పితాని బాలకృష్ణ పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ నుండి పోటీ చేస్తున్నది ఇప్పటిదాకా ఖరారు చెయ్యలేదు.