Pawan Kalyan Need to change his political viewతన వ్యక్తిగత ఇమేజ్ తోనే సినిమా రంగంతో పాటు రాజకీయాలలో కూడా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. రాంగోపాల్ వర్మ లాంటి ఘాటైన అభిమానులైతే పవన్ ను “క్రేజ్ కా బాప్” అని పిలుచుకుంటారు. ఇంతటి క్రేజ్ ను సంపాదించడానికి పవన్ తన సినీ ప్రస్థానంలో ఎంతో కష్టపడ్డారు.

తన మొదటి సినిమాలలోనే మార్షల్ ఆర్ట్స్ వంటి వినూత్న స్టంట్స్ తో యువత మదిలో క్రేజీ హీరోగా మారారు. చిరంజీవి తమ్ముడిగా సినీ అరంగేట్రం చేసినప్పటికీ చాలా కొద్దీ రోజులకే తన సొంత ఇమేజ్ ని కూడగట్టుకున్నారు. ఈ క్రేజ్ ఎక్కడి వరకు వెళ్లిందంటే… “అన్నను మించిన తమ్ముడిగా” యూత్ ఐకాన్ గా మారిపోయేటంతగా..!

ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. సినీరంగంలో తెచ్చుకున్న క్రేజ్ ను అడ్డం పెట్టుకొని రాజకీయ రంగంలో మనుగడ సాగించడం కష్టం అని సోదరుడు చిరంజీవిని చూసి కూడా పవన్ అర్ధం చేసుకోలేకపోవడం కాస్తంత విడ్డురంగానే ఉంటుంది. రాజకీయ రణరంగంలో క్షణం ఆలస్యం చేసినా ఎన్నో అవకాశాలను చేజార్చుకోవలసి వస్తుంది.

అటువంటిది పవన్ తన అమూల్యమైన సమయాన్ని పార్టీ బలోపేతానికి వెచ్చించకుండా, వృధా చేస్తున్నారని జనసేన అభివృద్ధిని కాంక్షించే ఎంతో మంది అభిమానుల ఆవేదన. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తులలో కేజ్రీవాల్ పేరును రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఢిల్లీతో మొదలుపెట్టి నేడు పంజాబ్ ను కైవసం చేసుకున్న కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని విశ్లేషిస్తున్నారు.

పార్టీ స్థాపించిన మొదటి ఎన్నికలతోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీని మరియు రాజకీయ ఉద్దండులుగా పేరొందిన మోదీ – షా ద్వయంలో ఉన్న బీజేపీని ఎదుర్కొని మొదటి అడుగే దేశ రాజధాని అయిన ఢిల్లీలో మోపి జెండా పాతారు. ‘ఛత్రపతి’ సినిమాలో “ఒక్క అడుగు” అన్న డైలాగ్ మాదిరి ఢిల్లీతో మొదలైన తన మొదటి అడుగు ఇప్పుడు పంజాబ్ పై పడింది.

“దిగ్గజ పార్టీలను కాదని మా పార్టీకే ఓటు వేశారంటేనే అర్ధమవుతోంది మా పార్టీ అంటే ఎంత స్పెషలో” అని నేడు గర్వంగా చెప్పుకుంటున్నారు క్రేజీ కేజ్రీవాల్. ఎటువంటి రాజకీయ వారసత్వము, సెలబ్రెటీ స్టేటస్ లేకుండా, కేవలం తన కష్టాన్ని నమ్ముకుని, పట్టుదలతో, మొక్కవోణి దీక్షతో దేశం మొత్తం తన వైపుకు తిరిగి చూసేలా చేసుకున్నాడు.

పవన్ కూడా ఇదే పంధాలో ముందుకెళితే తానూ ఎంచుకున్న లక్ష్యం చేరడం ఎంతో దూరంలో లేదని చెప్పొచ్చు. అయితే పవన్ వ్యవహారశైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని, ఆయన వేస్తోన్న రాజకీయ అడుగులు చూస్తే ఇట్టే చెప్పొచ్చు. ‘జనసేన’ అంటూ పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు గడిచినా “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా ఉంది పార్టీ పరిస్థితి.

ఒక్కడుగా మొదలైన పార్టీ ఇన్నేళ్లు గడిచినా ఒక్కడితోనే నడుస్తోంది. పవన్ తన అశేష అభిమాన గణాన్ని పార్టీ కార్యకర్తలుగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. పొరపాటు ఎక్కడ జరిగిందో చర్చించి, ఆ తప్పులను సవరించుకుంటూ ఎప్పడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పవన్, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అభిమానులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది.

తన బలాన్ని గుర్తించి, బలహీనతలను విడనాడి పార్టీని పటిష్ట పరిస్తేనే రాజకీయ కురుక్షేత్రంలో నిలబడగలుగుతారు, కేజ్రీవాల్ మాదిరి విజయబావుటా ఎగురవేయగలుగుతారు. ఒక్క క్రేజ్ ను చూసుకుని రాజకీయాలు చేద్దామంటే, ‘వాపును చూసి బలుపు’ అనుకోవడమే అవుతుంది. క్రేజ్ ని చూసి ఓట్లు వేసే రోజులు మారాయి. రాజకీయ నాయకుడు ఎంత కష్టపడితే ప్రజలు అంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు.

దానికి ఉదాహరణకు ప్రస్తుత ఏపీ సీఎం జగన్. అక్రమాస్తుల కేసులు, దానికి తగిన విధంగా 16 నెలల జైలు జీవితం గడిపినప్పటికీ., ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీక్షలని, నిరసనలని, పాదయాత్రలని నిత్యం ప్రజలలో కలిసి తిరిగారు కాబట్టే ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నారు. నాడు ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా ప్రజలను నమ్మించగలిగారు. అయితే ఇప్పుడు అధికారంలో కి వచ్చాక మాత్రం “కష్టం ఎవరిదో…! సుఖఃము ఎవరిదో..!” ఆ భగవంతుడికే ఎరుక…!