Pawan Kalyan Narendra Modi Visakhapatnam  Meeting Agendaప్రధాని నరేంద్రమోడీ శనివారం విశాఖలో రూ.10,742 కోట్లు విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. చాలా సంతోషం. అయితే నేటికీ విభజన హామీలను నెరవేర్చనే లేదు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్రమోడీని గట్టిగా నిలదీసి అడుగుతానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోగా కనీసం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం అమ్మకుండా అడ్డుకోలేకపోతున్నారు.

సరే! ఆయన సమస్యలు ఆయనకున్నాయి. కనుక అడగలేకపోతున్నారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు?

పవన్‌ కళ్యాణ్‌కి తమ అధిష్టానంతో నేరుగా మాట్లాడగల సత్సంబంధాలున్నాయని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు స్వయంగా చెప్పారు కదా? అది నిజమని నిరూపిస్తూ మోడీతో భేటీకి ఆహ్వానం కూడా వచ్చింది కూడా. అయితే 10 నిమిషాల భేటీలో ఏపీకి సంబందించిన అన్ని అంశాలు, సమస్యలపై పవన్‌ కళ్యాణ్‌ ప్రధాని నరేంద్రమోడీతో చర్చించలేకపోవచ్చు. కానీ ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరితో తాను అసంతృప్తిగా ఉన్నాననే విషయమైన ధైర్యంగా చెప్పగలరా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏ సమస్యపైనైనా ఎన్ని మాటలైనా మాట్లాడగలరు కానీ అధికారంలోకి వస్తే మాట్లాడలేరని సిఎం జగన్ నిరూపిస్తున్నారు. కనుక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడవచ్చు కదా?ఒకవేళ బిజెపితో పొత్తులో ఉన్నామనో లేదా ప్రధాని నరేంద్రమోడీ నొచ్చుకొంటారనో ఏపీ సమస్యల గురించి పవన్‌ కళ్యాణ్‌ ధైర్యంగా చెప్పలేకపోతే ఇక బిజెపికి, జనసేనకు మద్య తేడా ఏముంటుంది?

జనసేన-బిజెపి పొత్తులు, ఈ రాజకీయాలు, ఎన్నికలలో గెలుపోటములు అన్నిటినీ పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఏపీని కేంద్రం పట్టించుకోవడం లేదని పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా నమ్ముతున్నప్పుడు అదే విషయం ప్రధాని నరేంద్రమోడీకి నిర్మొహమాటంగా చెప్పడం చాలా అవసరం ఉంది కదా?

ఏపీ విషయంలో బిజెపి, కేంద్ర ప్రభుత్వం ద్వందవైఖరి అవలంభిస్తే వాటికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ వచ్చే ఎన్నికలలో తన సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్న పవన్‌ కళ్యాణ్‌ ద్వంద వైఖరి లేదా ఇంకా మెతక వైఖరిని అవలంభిస్తే విశ్వసనీయతని కోల్పోయి రాజకీయంగా ఆయనే నష్టపోతారు. కనుక ఏపీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకొనేలా ప్రధాని నరేంద్రమోడీని ఒప్పించగలిగితే అందరూ సంతోషిస్తారు.