పవన్ కు పొంచి ఉన్న భీమవరం గండం!గత ఎన్నికలలో జనసేన అధినేత పోటీ చేసిన రెండు నియోజక వర్గాలలో భీమవరం ఒకటి. నాడు పవన్ పై ఎలా అయినా విజయాన్ని సాధించాలని కంకణం కట్టుకున్న వైసీపీ, భీమవరంను దిగ్విజయంగా సొంతం చేసుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఓటమి సహజంగానే ఏపీలో హాట్ టాపిక్ గా మిగిలిపోయింది.

అలా భీమవరం ఒక చేదు అనుభవంగా పవన్ రాజకీయ జీవితంలో మిగిలిపోగా, తాజాగా మరోసారి భీమవరం విషయం పొలిటికల్ గా హైలైట్ కాబోతోంది. త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో 4 మునిసిపాలిటీలకు (తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు & భీమవరం) ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ నాలుగింటిలో రాజకీయంగా భీమవరం అత్యంత ప్రాధాన్యతను దక్కించుకుంది. అలాగే పొలిటికల్ వర్గాల్లో కూడా భీమవరం నియోజకవర్గం ప్రెస్టేజ్ ఇష్యూ కానుంది. మరి మున్సిపాలిటీ ఎన్నికలను పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కోబోతున్నారు? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాలలో అత్యంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

2019లో విజయ పతాకం ఎగురవేసిన వైసీపీని ఒంటరిగా జనసేన ఎదుర్కొనే పరిస్థితి లేదు. దీంతో తెలుగుదేశం పార్టీతో పెట్టుకునే పరిస్థితి అనివార్యం కానుంది. పవన్ సొంత నియోజక వర్గంగా మారిన భీమవరంలో జనసేన జెండా ఎగరాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

విజయం కోసం టిడిపితో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా పవన్ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒంటరిగా వెళితే సక్సెస్ దరిచేరకపోవచ్చు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే సంకట స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. భీమవరం మునిసిపల్ ఎలక్షన్స్ రూపంలో పొంచి ఉన్న ఈ గండాన్ని పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

అయితే ఇప్పుడు కాకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన – టీడీపీల పొత్తు అనివార్యం కానుంది గనుక, అదేదో రెండేళ్ల ముందు నుండే ప్రజల్లోకి బలంగా ఈ పొత్తును భీమవరం మునిసిపల్ ఎలక్షన్స్ ద్వారా తీసుకెళ్లే అవకాశాన్ని పవన్ వినియోగించుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి పవన్ మదిలో ఏముందో రానున్న రోజుల్లో తెలియనుంది.