Pawan-Kalyan-MP-Elections-Andhra-Pradesh-Jana-Sena-Partyచిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 18 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఎంపీ స్థానాలలో అయితే అసలు ఖాతా కూడా తేర్చుకోలేదు. ఈ సారి ఎలాగైనా పార్లమెంట్ లో తన పార్టీ అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఎంపీ స్థానం గెలవడం అంటే అది అంత తేలికైన విషయం కాదు. ప్రతీ ఎంపీ సెగ్మెంటు కింద ఐదు నుండి ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. ఎంపీ స్థానం గెలవాలంటే మెజారిటీ శాసనసభ నియోజకవర్గాలలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి.

అయితే జనసేన కు ఆ అవకాశం చాలా తక్కువ. దీనితో పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతను తన మీదే వేసుకున్నాడు. జనసేనకు అవకాశం ఉన్న రెండు ఎంపీ స్థానాలు – విశాఖపట్నం, నరసాపురం. దీనికి తన వద్ద ఉన్న బెస్టు అభ్యర్థులను (జేడీ లక్ష్మీనారాయణ, నాగబాబులను) నిలబెట్టాడు. ఈ ఎంపీ స్థానాల కింద ఉండే అసెంబ్లీ స్థానాలలో స్వయంగా రంగంలోకి దిగాడు పవన్. విశాఖపట్నం ఎంపీ కింద వచ్చే గాజువాక, నరసాపురం కింద వచ్చే భీమవరం నుండి ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ పవన్ గనుక అత్యధిక ఓట్లు తీసుకురాగలిగితే మిగిలిన శాసనసభ స్థానాలలో ఓ మోస్తరు ప్రదర్శన ఇచ్చినా వాటిని గెలుచుకునే అవకాశం ఉంది.

విశాఖపట్నం ఎంపీ సెగ్మెంటులో ఎక్కువగా చదువుకున్న వారు ఉండటంతో జేడీ వారిని ఆకర్షించే అవకాశం ఉంది. అదే సమయంలో కాపులు ఎక్కువగా ఉండే నరసాపురంలో నాగబాబు కు గెలిచి రావొచ్చు. అయితే ఈ రెండు స్థానాలలోను హేమాహేమీలే బరిలో ఉన్నారు. డబ్బు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీనితో గెలవడం అనేది అంత తేలికైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ గనుక తన స్థానాలలో కనీవినీ ఎరుగని ప్రదర్శన ఇస్తే మాత్రం గెలుపు ఖాయం చేసుకోవచ్చు. చూడాలి ఏం జరగబోతుందో!