pawan kalyan movie Kushi Re-Releaseకొన్ని అపురూప వస్తువులు కాలం గడిచే కొద్దీ విలువ పెరుగుతాయి. ఉదాహరణకు గాంధీ కళ్ళజోడు, సుభాష్ చంద్ర బోస్ తుపాకీ, ఎన్టీఆర్ టేప్ రికార్డర్ ఇలా కొన్ని ఉదాహరణలు. అలాగే సినిమాలు కూడా ఏళ్ళు కరిగే కొద్దీ వాటి స్టేటస్ పెరుగుతూ పోతుంది. మాయాబజార్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్నామంటే కారణమదే. షోలే ఇంకో వందేళ్లయినా దాని చరిత్రకు చెదలు పట్టవు. వర్మ ఇప్పుడెంత భ్రష్టు పట్టినా ఒకప్పుడు శివ అనే క్లాసిక్ ఇచ్చిన దర్శకుడిగా ఆ గౌరవమే అభిమానులను కొనసాగిస్తోంది. అంతెందుకు ఆరంజ్, నేనొక్కడినే లాంటి డిజాస్టర్స్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో కల్ట్ క్లాసిక్ గా గుర్తింపబడుతున్నాయంటే ఎందుకో వేరే చెప్పాలా.

గత మూడు నెలల నుంచి ఈ ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది. యుట్యూబ్, ఓటిటిలో అత్యంత సులువుగా దొరికే పాత సినిమాలు రీ రిలీజ్ చేయడం ఇప్పుడో నిత్య వ్యాపకంగా మారిపోయింది. ఆ మధ్య పోకిరి వచ్చినప్పుడు ఎగబడి చూశారు. జల్సాకు రికార్డు కలెక్షన్లు చేతిలో పెట్టారు. చెన్నకేశవరెడ్డికి మంచి ఆదరణే దక్కింది. అప్పట్లో యావరేజ్ అయిన బిల్లాకు మొన్న అక్టోబర్ లో ఆర్టిసి క్రాస్ రోడ్స్ దగ్గర చేసిన హల్చల్ చిన్నది కాదు. సరే ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది. విపరీతమైన ఆకలి వేసినవాడు సైతం తన కడుపు నిండేంత తింటాడు కానీ వారానికి సరిపడా బిర్యానీ ఒకేసారి లాగించగలడా. అలా చేస్తే నాయక్ లో బ్రహ్మానందంలా ఆసుపత్రికి పరిగెత్తాలి.

ఇప్పుడిదంతా ఎందుకంటే హఠాత్తుగా ఖుషి రీ రిలీజ్ ని ప్రకటించారు. ఈ నెల 31న విడుదల చేయబోతున్నట్టు సూర్య మూవీస్ అఫీషియల్ గా చెప్పేసింది. పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇరవై ఏళ్ళ కిందట వచ్చిన ఖుషి మాములు బ్లాక్ బస్టర్ కాదు. రికార్డులు బద్దలు కొడుతూ యూత్ వెర్రెత్తిపోయేలా మళ్ళీ మళ్ళీ చూసేలా చేసిన మ్యూజికల్ ఎంటర్ టైనర్. పవన్ ఇందులో కనిపించినంత అందంగా, హుషారుగా డాన్సులు వేసినంత తీరు ఇంకెందులోనూ చూడలేమంటే అతిశయోక్తి కాదు. ఇదెంత పెద్ద సక్సెస్ అంటే దర్శకుడు ఎస్జె సూర్యతో మహేష్ బాబు కథ వినకుండా పిలిచి మరీ సినిమా ఇచ్చేంత. అఫ్కోర్స్ అది నాని రూపంలో దెబ్బ వేయడం వేరే కథ.

అభిమానుల ఉత్సాహాన్ని అర్థం చేసుకోవాల్సిందే కానీ మరీ ఇంతలా ఒక ప్రవాహంలా ఇన్నేసి రీ రిలీజులు చేయడం వల్ల సగటు మాములు ప్రేక్షకుడికి వీటి మీద ఆసక్తి తగ్గిపోతే చేతులారా బంగారు బాతుని కోసేసి గుడ్లను వెతుక్కున్నట్టే. మన ఇష్టదైవం ఉండే పుణ్యక్షేత్రానికి ఏడాదికి ఒకటో రెండుసార్లో వెళతాం కాబట్టే ఆ అనుభూతి అనిర్వచనీయంగా ఉంటుంది. అదే వారంలో మూడు సార్లు వెళ్లే ఛాన్స్ దొరికితే. ఫీలింగ్ తగ్గకుండా ఉంటుందా. ఇప్పుడీ క్లాసిక్స్ రీరిలీజ్ సంగతి కూడా ఇంతే. అందుకే ప్రేమదేశంని ఎవరూ పట్టించుకోలేదు. ఖుషిలో బోలెడు గూస్ బంప్స్ ఫ్యాన్ మూమెంట్స్ పాటలు ఫైట్లు ఉన్నాయి. అవే ఇప్పుడీ ఎదురుగాలిని తట్టుకుని నిలబెడతాయేమో చూడాలి.