జననం… 27-05-2009 మరణం… 27-05-2017… ఇది క్లుప్తంగా రాంగోపాల్ వర్మ యొక్క ట్విట్టర్ జీవితం. ఈ నడుమ ఉన్న ఈ ఎనిమిదేళ్ళ సమయంలో ఎన్నో సంచలనమైన ట్వీట్లతో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల దగ్గర నుండి దేవుళ్ళ వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ట్విట్టర్ లో కామెంట్స్ చేసిన వర్మ, ఎట్టకేలకు వాటికి చరమగీతం పాడుతూ ట్విట్టర్ కు ముగింపు పలకడం విశేషం.

అయితే ఈ ఎనిమిదేళ్ళ కాలంలో చాలామందిపై కామెంట్స్ చేసినప్పటికీ, ఎక్కువగా హైలైట్ అయ్యింది మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులే. ఏ అంశం వచ్చినా, దానిని పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ అభిమానులను ఓ రేంజ్ లో ఇరిటేట్ చేసారు వర్మ. దీంతో వర్మ ట్వీట్లతో విరక్తి చెంది ఒకానొక సమయంలో ‘వర్మ మరణించారంటూ’ ఏకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేసారు పవన్ అభిమానులు.

జనసేనతో రాజకీయాలలోనూ, సినిమాలతో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా ఉన్న పవన్ పై ప్రశంసలు కురిపిస్తూనే… వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం ఒక్క వర్మకే చెందింది. అలాగే సెక్స్ గురించి, అడల్ట్ కంటెంట్ గురించి, హీరోయిన్లకు సంబంధించి… ఇలా ఏ కామెంట్ చేసినా, వర్మతో వాగ్వివాదం చేసే ధైర్యం మాత్రం ఎవరికీ లేకపోయింది. ఇక ట్విట్టర్ నుండి అయితే వైదొలగారు గానీ, తన తదుపరి ప్రస్థానం ‘ఇంస్టాగ్రామ్’లో కొనసాగుతుందని స్పష్టం చేసారు.