Pawan Kalyan met Amit Shahజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై మరోసారి ఆలోచించమని చెప్పి వచ్చారు. అయితే తిరుపతి ఉపఎన్నికలో ఎవరు పోటీ చేస్తున్నారు అని విలేకరులు పవన్ కళ్యాణ్ ని అడగగా ఇప్పటికీ దాని మీద క్లారిటీ లేనట్టు గానే మాట్లాడారు.

“మార్చి 3వ తేదీన అమిత్‌షాతో భేటీ తర్వాత తిరుపతి బై ఎలక్షన్‌పై స్పష్టత ఇస్తాం,” అని చెప్పుకొచ్చారు. మూడు నాలుగు వారాలలో తిరుపతి ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికీ తిరుపతిలో పోటీ ఎవరు చెయ్యాలి అనే దాని మీద క్లారిటీ లేకపోవడం విశేషం. ఇక నోటిఫికేషన్ వచ్చే సరికి ఉండే హడావిడి తెలిసిందే.

ఇలా చివరి నిముషంలో తీసుకునే నిర్ణయాల వల్ల జనసేన – బీజేపీ కూటమి ఏ మాత్రం ప్రభావం చూపగలదో మనకు అర్ధం అవుతుంది. అయితే తిరుపతి నుండి తామే పోటీ చెయ్యబోతున్నాం అని బీజేపీ గట్టిగా చెబుతుంది. ఆ పార్టీ ఇప్పటికే అక్కడ గ్రౌండ్ లో పని చేసుకోవడం ప్రారంభించింది. చివరి నిముషంలో ఆ సీటు జనసేన తెచ్చుకున్నా ఏ మాత్రం ఉపయోగం ఉంటుందో చెప్పలేం.

వైఎస్సార్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో తిరుపతిలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఆయన కుటుంబసభ్యులకు సీటు ఇవ్వకపోయినా తమకు మూడు లక్షల మెజారిటీ ఖాయమని అధికారపక్షం ధీమాగా ఉంది. ఎస్సి జనాభా ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడం, అధికారంలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశాలు.