Pawan Kalyan Mahesh Babu Satyanand Acting Instituteప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న టాప్ హీరోలందరూ సత్యానంద్ గారి శిష్యులే అన్న విషయం తెలిసిందే. విశాఖ వేదికగా వారందరికీ శిక్షణ ఇచ్చిన సత్యానంద్ కు తొలి శిష్యుడు ఎవరు అంటే… మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని స్వయంగా సత్యానందే సెలవిచ్చారు. పవన్ కు ఇచ్చిన శిక్షణ తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని, నిజానికి ఈ రోజు ఇలా ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు సత్యానంద్.

తాజాగా ఓ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిరుచులు పంచుకున్న సత్యానంద్, విశాఖలో తానూ, పవన్ ఒకే గదిలో ఉండేవారమని, ఇద్దరి అభిరుచులు బాగా కలిసాయని, నా ఆర్ధిక స్థోమత పవన్ కు తెలుసు, నా సోదరి వివాహానికి కూడా ఆర్ధికంగా పవన్ సహాయం అందించారు, అలాగే తను శిక్షణ ఇచ్చినందుకు గానూ ఏమీ అడగలేదు గానీ, వాళ్ళే లక్ష రూపాయల వరకు ఇచ్చారని తన గత స్మృతులను పంచుకున్నారు. పవన్ తర్వాత వచ్చిన హీరో మహేష్ బాబుగా చెప్పిన సత్యానంద్, ప్రిన్స్ గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

స్వతహాగా బాల నటుడు కావడంతో మహేష్ కు ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయిందని, ఎంతటి డైలాగ్ అయినా ఇట్టే చెప్పేయగలుగుతారని, ఒక రోజు రెండున్నర్ర పేజీల డైలాగ్ ఇస్తే 10 నిముషాల్లో చెప్పేసాడని, క్లాస్ అంటే క్లాస్… అంతకు మించి మరొక్క మాట కూడా ప్రస్తావించడు, సినీ పరిశ్రమలో టాప్ 3 హీరోలలో మహేష్ ఖచ్చితంగా ఒకరవుతారని ఆ రోజే చెప్పానని, తన అంచనా నిజమైనందుకు సంతోషంగా ఉందని ప్రిన్స్ గురించి చెప్పుకొచ్చారు.