Pawan Kalyan lost in bhimavaram and gajuwakaతన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. భీమవరం, గాజువాకలలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఏ రౌండ్ లోను స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించలేదు. కొన్ని సార్లు ఆయన ఆధిక్యంలోకి వచ్చినా విజయం ఆయనతో దోబూచులాడి చివరికి రెండు చోట్లా ఆయన ఓడిపోయారు.

రెండు సీట్లలోనూ ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం గమనార్హం. దీనితో జనసైనికులు పూర్తిగా నిరాశలో కృంగిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ రెండు సీట్లూ ఓడిపోవడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఊరట అనే చెప్పుకోవాలి. కనీసం ప్రతిపక్షంలోనైనా అంతా తామే వ్యవహరించే అవకాశం ఉంటాది. ఒకవేళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కి వచ్చి దూకుడుగా వ్యవహరిస్తే అది తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికే ప్రమాదం.

మరోవైపు అసెంబ్లీకి వెళ్లే అవకాశం కూడా లేకుండా ప్రజలు పవన్ కళ్యాణ్ కు పెద్ద పరీక్షే పెట్టారు. వచ్చే ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ నిబద్ధతకు, ఓర్పుకు పరీక్షగా నిలవబోతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ పై సినిమాలలోకి తిరిగి రావాలని తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దీనిని తట్టుకుని ఆయన నిలబడగలరో లేదో చూడాలి. దాని మీదే జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లేకపోతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలాగానే జనసేన కూడా ఒక్క ఎన్నికల పార్టీగా మిగిలిపోతుంది.