pawan-kalyan-jana-sena-defeat-reviewతన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. దీనితో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తారు అనే వదంతులు బాగా వ్యాపించాయి. అయితే పలుమార్లు పవన్ కళ్యాణ్ తనకు ఆ ఉద్దేశం లేదని ప్రజాసేవకే నా జీవితం అంకితం అని చెప్పుకొచ్చారు. అయినా ఆయన పునరాగమనం పై పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి.

అభిమానులను, ప్రజలను నమ్మించడానికి పవన్ కళ్యాణ్ తన గుబురు గెడ్డాన్ని కూడా తొలగించడం లేదు. గెడ్డం తీస్తే సినిమాలలోకి వస్తాడు అనే ఉద్దేశానికి వస్తారని ఆ అసౌకర్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ భరిస్తున్నారు. అయితే పవన్ కు గతంలో అడ్వాన్సులు ఇచ్చి ఆయన డేట్లు కోసం ఎదురు చూస్తున్న నిర్మాతల పరిస్థితి అడ్డా కత్తెరలో పావు చెక్క మాదిరి ఉంది. ఇచ్చిన డబ్బులకు వడ్డీలు చాంతాడంత అవుతున్నాయి. అదే సమయంలో తిరిగి ఇవ్వమని అడగలేరు.

తిరిగి ఇచ్చేయమని అడుగుదామంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుంటే ఒక టాప్ హీరోతో సినిమా చేసే అవకాశం పోతుంది. దీనితో వారికి ఎటు పాలు పోవడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అస్థిరత్వానికి మారు పేరు. ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ ఐదు సంవత్సరాలలో చూపే నిగ్రహం, కమిట్ మెంట్ మీదే జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంది. సినిమాలు చేస్తే ఖచ్చితంగా జనసేనకు అది ఇబ్బందిగానే ఉంటుంది.