Pawan Kalyan latest tweet on  special category  statusఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే, తిరగబడతామంటూ కేంద్ర ప్రభుత్వంను హెచ్చరించిన ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా కోసం జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతి ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, ఆయన ‘దేశ్ బచావో’ పేరిట ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తమ గొంతును ‘జనసేన’ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయబోయే ఈ మ్యూజికల్ ఆల్బం ద్వారా వ్యక్తం చేస్తామని అన్నారు.

“మేము పూల గుత్తులు వేలాడే వసంత రుతువులం కాదు, వట్టి మనుషులం. దేశం మాకు గాయాలిచ్చినా, నీకు మాత్రం మేము పువ్వులనే ఇస్తున్నాం. ఓ ఆశచంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించు, ఏమి తెస్తావో మా అందరి కోసం. ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు”, అంటూ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన నేతలపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడే క్రమంలో చట్టం చేసే నేతలకు గర్తు చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు.

అలాగే భవిష్యత్ తరాల గొప్ప జీవితం కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగభరితమైన కామెంట్ చేశారు. “నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యంలో చల్లలేకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నీవు బానిసగానే ఉండిపోవడానికే నిర్ణయించుకుంటే… ఆ పవిత్ర రక్తానికి నీవు ఎంత ద్రోహిగా మారావో తెలుసుకో” అంటూ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.