Pawan-Kalyan-Latest-Tirumalaపవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత… “ఏదో జరుగుతుందని” కొందరు, “ఏం జరుగుతుందని” ఇంకొందరు, “ఏమీ జరుగుతుందిలేనని” మరికొందరు, ఇలా ఎవరికీ తోచిన ఆలోచనలు వారు చేసుకున్నారు. అలా నాలుగేళ్ళు గడిచాయి. “ఏం జరిగిందో” అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టిడిపి – బిజెపిలకు సహకారం అందించిన వ్యక్తి కాస్త, ఇప్పుడు బిజెపితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలను చవిచూస్తున్నారు.

ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… పవన్ వస్తే ఏదో “అద్భుతాలు” జరుగుతాయని ఆశించిన వారికి స్పష్టత ఇవ్వడంలో పవన్ విజయవంతం అయ్యారు. ఇక రాబోయే ఎన్నికలలో ఇంకెన్నో “అద్భుతాలు” సృష్టిస్తారోనని లక్షలాది అభిమాన గణం ఎదురుచూస్తున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే దాదాపుగా మరో ఏడాది సమయం మిగిలి ఉంది. మరి సినిమాలను పూర్తిగా వదిలేసిన పవన్ కళ్యాణ్, గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు? అంటే నోరెళ్ళబెట్టాల్సిందే!

ఇదిగో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇలాంటి వీడియోలను చూస్తూ ఫ్యాన్స్ ను మురిసిపోయేలా చేయడం తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ సీరియస్ గా చేస్తున్నదేమి లేదనే చెప్పాలి. గడిచిన నాలుగేళ్ళల్లో అనేక ప్రాంతాలలో అనేక బహిరంగ సభలు పెట్టారు. ఆయా సభల ద్వరా…. సీరియస్ అంశాలను (డబ్బులు తీసుకోండి, అందరూ నాకే ఓటు వేయండి) సిల్లీగా చేయడంలో సిద్దహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు తప్ప, పెద్దగా పవన్ సాధించింది ఏమీ లేదు.

భవిష్యత్తు మీద ఆశ ఉండడం మానవ సహజం. అందుకే వచ్చే ఏడాది లోపు ఏదొకటి చేసి, ఆ సిఎం పీఠం కాస్త ఎక్కేస్తారనే ఊహలలో ఉండే అభిమానుల సంఖ్యకు కొదవలేదు. అయితే అది లోయలలో నుండి వస్తోన్న మంచినీరు త్రాగినంత తేలిక కాదని మాత్రం గుర్తించలేకపొతున్నారు. నిజంగా ప్రశంసించాల్సిన విషయం వస్తే అభినందించాలి తప్ప, ఇలా కొండలలో, లోయలలో నీరు తాగే ప్రతి చిన్న విషయానికి భజనలు చేయడం అనేది, ‘అసలు విషయం లేకనే’ అన్న దృక్పధాన్ని తెరపైకి తెస్తుంది.