2019 ఎన్నికలలో జనసేన పార్టీ ఒక్కే ఒక్క సీటు సాధించింది. దానికి అనేక కారణాలు ఉన్నా… ప్రధానమైనది మాత్రం ప్రజలు పవన్ కళ్యాణ్ ను సీరియస్ రాజకీయ నాయకుడిగా చూడకపోవడమే. ఎన్నికల తరువాత ఆ ఉద్దేశాన్ని చెరిపే ప్రయత్నం పవన్ పెద్దగా ఏమీ చెయ్యలేదు. చెయ్యకపోగా సినిమాలు చెయ్యడంతో దానిని మరింత బలపరుస్తున్నారు.

నాకు సినిమాలు తప్ప ఏమీ తెలీదు…. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే సినిమాలు చెయ్యాలి అనే కారణం అందరూ నమ్మినా నమ్మకపోయినా కొంతవరకు సరే అనుకోవచ్చు. అయితే పవన్ తాజాగా ఒకటి కాదు మూడు సినిమాలు ప్రకటించేశాడు. ఇప్పటికే ఆయన పింక్ సినిమా షూటింగ్ చేస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టాడు.

పింక్ రీమేక్ వేసవికి విడుదల అయ్యే అవకాశం ఉంది. క్రిష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా తన గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఇంకో సినిమా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రైమ్ లో ఉన్నపుడు కూడా ఆయన ఒక సినిమా చేస్తుండగా ఇంకో సినిమా కంఫర్మ్ అయిన దాఖలాలు లేవు.

ఇప్పుడు ఎందుకు ఇంత కంగారు? హరీష్ సినిమా ఈ ఏడాది చివరన గానీ సెట్స్ మీదకు వెళ్ళదు. ప్రజలు పవన్ రెండు ఓడల ప్రయాణాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియని సెన్సిటివ్ సమయంలో ఇంకో సినిమా ప్రకటించాల్సిన అవసరం ఏముంది? తన సొంత చేతులతో తన రాజకీయ కేరీర్ కు పవన్ సమాధి కట్టుకుంటున్నారు అంటే జనసైనికులు కూడా కాదు అని చెప్పలేని పరిస్థితి.