pawan_kalyanదాదాపు గత వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా మారారు. కాకినాడ సభకు ముందు నుండి ప్రారంభమైన ఈ హంగామా, సభ ముగిసిన మూడు రోజుల వరకు కూడా కొనసాగింది. పవన్ సభలో స్పష్టత లేకపోవడంతో, పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సభలోని అంశాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇలా పవన్ వ్యాఖ్యలపై రకరకాల విశ్లేషణలు, చర్చలు ముగిసాయి.

పవన్ కూడా తన కార్యాచరణ తనకుందని, ఈ ఏడాది చివరి వరకు ప్రభుత్వాలకు సమయం ఇస్తూ సైలెంట్ అయ్యారు. ఇక, పవన్ దృష్టి అంతా తన తదుపరి సినిమాపైన పెట్టబోతున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న “కాటమరాయుడు” సినిమాను ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ నాటికల్లా ముగించాలని పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో లుక్ కోసం, ఫిట్ నెస్ రీత్యా బెంగుళూరులో వారం రోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఒక్కసారి సినిమాలు ప్రారంభించిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మారుతున్న వర్తమాన రాజకీయాలపై పవన్ స్పందన ఏమిటి? ముఖ్యంగా ‘ప్రత్యేక హోదా’ అంశం చల్లారిపోయిన తర్వాత పవన్ చేయగలిగింది ఏంటి? ఒక్కసారి ‘ప్యాకేజ్’కు చట్టబద్ధత వస్తే… బిజెపి ఎదురుదాడి చేసే పరిస్థితులలో ఉంటుంది తప్ప… ఏ విమర్శలను లెక్క చేయదని చెప్పవచ్చు. అప్పుడు పవన్ లాంటి వ్యక్తులు ఎవరు గొంతు చించుకున్నా ఫలితం ఉండకపోవచ్చు. ఇలా ‘స్పెషల్ స్టేటస్’పై అనేక ప్రశ్నలను వదిలేస్తూ… పవన్ ప్రస్తుతం “కాటమరాయుడు” సినిమాకు సిద్ధమవుతున్నారు.