JanaSena-Pawan-Kalyan-TDP-Chandrababu-Naidu-ఏపీ రాజకీయాలలో కులాల కూడికలు, తీసివేతలు ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తూనే ఉన్నాయి. అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టిడిపి, జనసేనలు దగ్గరైతే తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కాపు సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ రాష్ట్రంలో కాపులకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని లేదా కాపులందరూ గంపగుత్తగా తనకే ఓట్లేస్తారని గానీ ఆశపడలేదు.

ఒకవేళ 2019 ఎన్నికలలో ఆయన కులం కార్డుతో ఎన్నికల గేమ్ ఆడి ఉండి ఉంటే ఓడిపోయేవారే కారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఆన్ని కులాలు నాకు సమానమే అందరినీ కలుపుకుపోవాలనుకొంటున్నానని పదేపదే చెప్పడం వలన ఆయన తన కులానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని, కనుక ఆయన వలన తమకి ఒరిగేదేమీ ఉండబోదని భావించిన కాపులు ఇతర పార్టీల మద్య చీలిపోయారు.

జనసేన ఓటమికి కారణాలు విశ్లేషించుకొన్నప్పుడు ఈ విషయం గుర్తించారు. కనుక ఈసారి ఎన్నికలలో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు, ముఖ్యంగా కాపుల ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు జనసేన గట్టిగా ప్రయత్నిస్తోంది. జనసేన ప్రయత్నాలకు ఈసారి కాపుల నుంచి సానుకూల స్పందనే వస్తోంది కూడా.

అయితే ఆయన రాజకీయాలలో మరింత నిలకడగా నిలబడాలని వారు గట్టిగా కోరుకొంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. కనుక రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వస్తుందని కాపులకు, తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు కూడా నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో అధికార వైసీపీని, టిడిపిని ఒంటరిగా ఎదుర్కొని జనసేన అధికారంలోకి రావడం అసంభవం. కనుక రాష్ట్రంలో బలంగా ఉన్న టిడిపితో పొత్తులు పెట్టుకొని ఎన్నికలలో గెలిచి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావలనేది జనసేన నాయకుల ఆలోచనగా కనబడుతోంది.

ఒకవేళ టిడిపి, జనసేనలు కలిస్తే కాపు సామాజికవర్గం ప్రజలతో బాటు పవన్‌ కళ్యాణ్‌ని అభిమానించేవారందరికీ కూడా నమ్మకం కలుగుతుంది. కనుక అప్పుడు వారి కూతమీకే ఓట్లు వేస్తారు. అంటే పవన్‌ కళ్యాణ్‌ చెపుతున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా వారి కూటమికి పడతాయి. ఇందుకే వైసీపీ అధినేత ఆందోళన చెందుతున్నారని చెప్పవచ్చు.

చంద్రబాబుపై ద్వేషంతో అకారణంగా రాష్ట్రంలోని యావత్ కమ్మ సామాజికవర్గాన్ని, వివిద కారణాలతో అగ్రవర్ణాలను చేజేతుల దూరం చేసుకొన్న వైసీపీ, ఇప్పుడు కాపు సామాజికవర్గం కూడా దూరం అయితే వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని ఆందోళన చెందుతోంది. అందుకే ఆ రెండు పార్టీలు చేతులు కలపకుండా అడ్డుకొనేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీ నేతలందరూ పవన్‌ కళ్యాణ్‌ని దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, చంద్రబాబు బానిస అంటూ రకరకాలుగా మాటలతో వేధిస్తున్నారు. తద్వారా పవన్‌ కళ్యాణ్‌ కాపు ఓట్లను చంద్రబాబుకి అప్పగించబోతున్నాడనే భావన కాపు సామాజిక వర్గానికి కలిగించగలిగితే వారు జనసేనవైపు మొగ్గకుండా దూరం చేయవచ్చనే వైసీపీ దురాలోచన స్పష్టంగా కనబడుతోంది.

అయితే వైసీపీ పవన్‌ కళ్యాణ్‌ను తాము ఎంతగా వేదిస్తే అంతగా కాపులకు ఆయనపై సానుభూతి ఏర్పడి జనసేనకు మరింత దగ్గరవుతారని వైసీపీ రాజకీయ మేధావులు గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ మొన్న విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆయన పట్ల వ్యవహరించిన తీరుని ఒక్క కాపు సామాజికవర్గానికి చెందినవారు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యవిలువలను నమ్మే ప్రతీ ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకించడం అందరూ చూశారు. కనుక టిడిపి, జనసేనలు దగ్గర కాకుండా చేయాలనే ప్రయత్నంలో వైసీపీ నేతల ప్రేలాపనలు, వారి చర్యలు అన్నీ పవన్‌ కళ్యాణ్‌కు మేలే చేస్తున్నాయని చెప్పవచ్చు.

అయితే కాపు సామాజికవర్గం ప్రజలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకొంటున్నట్లు మరింత నిలకడగా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. టిడిపి, బిజెపిలతో పొత్తుల విషయంలో మరింత పరిణతితో వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సర్దుబాట్లు చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి లేకుంటే 2019 ఎన్నికల ఫలితాలే మళ్ళీ పునరావృతం అవుతాయి. అప్పుడు ఆ రెండు పార్టీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా అందుకు మూల్యం చెల్లించాల్సివస్తుందని మరిచిపోకూడదు.