Pawan Kalyan - Jenasena Porata Yatra - Updatesజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈ విషాదం సంఘటన చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ పర్యటనను పురస్కరించుకుని, తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో పాయకరావుపేటలో విషాదం నెలకొంది. ఇదిలా ఉంటే ఏజెన్సీ ప్రాంతాలలో పవన్ పర్యటనలో పాల్గొన్న ఓ వృద్ధురాలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఇప్పటి వరకు తమ గ్రామానికి ఒక్కడు కూడా రాలేదని, ఈ మహానుభావుడు వచ్చాడని, దండం పెడుతున్నానని, అతడు ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకం తనకు ఉందన్న” వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సదరు వీడియోను చూసుకుంటూ ఆనందంలో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ షేరింగ్ లు చేసుకుంటూ సందడి చేస్తున్నారు. ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజన యువతీయువకులతో సమావేశం నిర్వహించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న పవన్… వైద్యం అందక గర్భిణులు పడుతున్న అవస్థలు చూసి స్పందించారు, వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత యధావిధిగా చంద్రబాబు సర్కార్ ను విమర్శించారు.