Pawan Kalyan - YS Jaganఇటీవలే కాలంలో ఎందుకో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీపై విమర్శలు తగ్గించి వైఎస్సాఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ తో పాటు టిడిపిని కూడా విమర్శిస్తున్నట్లు కనిపించినా, ఆయన కేంద్రీకరించింది వైఎస్సాఆర్ కాంగ్రెస్ పైన, జగన్ పైన అన్నది అర్ధం అవుతూనే ఉంది. దానికి జగన్ కూడా కారణమే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శించిన రోజున కూడా వ్యక్తిగత దూషణలకు దిగలేదు. జగన్ మాత్రం నిత్య పెళ్ళికొడుకు, నలుగురిని మోసం చేసాడు అంటూ విరుచుకుపడ్డారు.

జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ నేతలు యత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనకు బలం లేదంటూనే రాయబారాలు నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల సమావేశంలో విమర్శించారు. అంతటితో ఆగకుండా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో జనసేన పార్టీతో మాట్లాడిస్తున్నారని పవన్‌ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తెరాసతో జగన్ చేతులు కలపడాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈసడించుకున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసిపోతున్నారు అంటూ సాక్షి ప్రచారం మొదలు పెట్టింది.

చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టినన్ని రోజులూ ఎంజాయ్ చేసి ఇప్పుడు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ జగన్ స్నేహాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని వారు తేల్చేశారు. కేసీఆర్ తనకు మద్దతు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ దుగ్దతో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో జనసేనను టీడీపీకి ధీటైన శక్తిగా గుర్తించలేదని పవన్ కళ్యాణ్ మధన పడుతున్నారని వార్తలు వడ్డిస్తుంది సాక్షి. పవన్ కళ్యాణ్ అంటూ మళ్ళీ టీడీపీతో పొత్తుకు సిద్ధం అయితే ఖచ్చితంగా తెరాస వైకాపా పొత్తు, తన మీద సాక్షి ద్వారా చేస్తున్న దుష్ప్రచారం వంకగా చూపించి ఆ పని చేస్తారు.

ఆ ప్రకారం చూస్తే జగన్ మోహన్ రెడ్డి వారిద్దరినీ తిరిగి కలిపినట్టు అవుతుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం కూడా లేదు ఈ సమయంలో కూడా ఏ పార్టీ ఎటు వైపు ఉందో తెలియకపోవడం విశేషం. జగన్ మాత్రం పొత్తులు వద్దు అనుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ లాంటి వారితో వైరం కూడా పెట్టుకుంటున్నారు. ఒక వేళ త్రిముఖ పోటీలో హంగ్ ఫలితామంటూ వస్తే అసలు పవన్ కళ్యాణ్ కు మొహం కూడా చూపించలేని పరిస్థితి. ఇదంతా ఇప్పుడు అవసరమా అని ఆ పార్టీ నాయకులే అనుకుంటున్నారు.