Pawan Kalyan JanaSena to Complaint on YSRCP Social Mediaచేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీల వరస. ఇటీవలే జరిగిన ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన పార్టీలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి దెబ్బ తిన్నాయి. ఇప్పుడు ఆ పార్టీలు సోషల్ మీడియా మీద దృష్టి పెడుతున్నాయి. టీడీపీ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంటే… జనసేన తనను టార్గెట్ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ మీద దృష్టి పెట్టింది.

తమ పార్టీపై సామాజిక మాధ్యమాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తమ సోషల్ మీడియా వింగ్ తో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపిస్తుంది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్‌ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్‌ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించినట్లు వారు చెబుతున్నారు.

అయితే అధికార పార్టీ మీద ఇచ్చే కంప్లయింట్లకు ఏం ఉపయోగం ఉంటుంది? పోనీ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేసినట్టు తెలంగాణలో కంప్లయింట్లు ఇవ్వడానికి అక్కడ కూడా ఉన్నది జగన్ అనుకూల ప్రభుత్వమే. టీడీపీ మాదిరిగా జనసేనకు సోషల్ మీడియాలో అశేషమైన వాలంటీర్లు ఉన్నారు. కానీ వారిని సంఘటితం చేసే వ్యవస్థ లేక నష్టపోయింది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి పెడుతుందేమో చూడాలి.