Pawan_Kalyan_Telanganaజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద తన ప్రచార వాహనం ‘వారాహి’కి వాహనపూజ చేయించుకొన్నారు. ఈ సందర్భంగా వేలాదిమంది అభిమానులు పవన్‌ కళ్యాణ్‌ వెంట బైక్‌లతో ర్యాలీగా తరలివచ్చి ఆయనకి ఘనస్వాగతం పలికారు.

వాహన పూజ ముగిసిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “తెలంగాణలో 7-14 లోక్‌సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. వచ్చే ఎన్నికలలో కనీసం 10 మంది జనసేన ఎమ్మెల్యేలని శాసనసభకి పంపాలనుకొంటున్నాము. జనసేనతో ఎవరైనా పొత్తులకి వస్తే మంచిదే లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తాము,” అని చెప్పారు.

ఇప్పుడు తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన సంగతి తెలిసిందే. భారీగా ఖర్చు పెట్టగలిగలిగే స్థోమత ఉన్నవారే ఎన్నికలలో పోటీ చేయగలరు తప్ప సాధారణ స్థాయి వ్యక్తులు, నేతలు, కార్యకర్తలు ఎవరూ పోటీ చేయలేరు. చేసినా గెలవలేరు.

ఓ కార్పొరేటర్‌గా పోటీ చేయాలన్నా కనీసం కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్‌ ఆర్ధికంగా, రాజకీయంగా బలంగా ఉంది. బిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలని, మంచి అంగబలం, అర్దబలం ఉన్న ఆ పార్టీలలోని దేశముదురు నాయకులని, ముఖ్యంగా సిట్టింగులని ఎదుర్కోవడం, వారిని ఎన్నికలలో ఢీని ఓడించడం జనసేన వల్ల సాధ్యమేనా?అంటే అనుమానమే.

అసలు జనసేన పార్టీలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో గానీ పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఈ ముగ్గురూ తప్ప మరో నాయకుడి పేరు సామాన్య ప్రజలకి తెలియదనే చెప్పొచ్చు. కనుక ఏపీ, తెలంగాణలో ప్రజలు జనసేనకి ఓట్లు వేయాలంటే పవన్‌ కళ్యాణ్‌ మొహం చూసే ఓట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదే బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్‌, టిడిపి, వైసీపీలలో ప్రజలకి పరిచయమున్న నాయకులు అనేకమంది ఉన్నారు.

కనుక ముందుగా తన పార్టీ నేతలని ప్రజలకి పరిచయం చేసేవిదంగా పవన్‌ కళ్యాణ్‌ సభలని జనసేన వినియోగించుకోవాలి. అలాగే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల అభిమానాన్ని ఓట్లుగా మార్చుకొనేందుకు గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది.

పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై స్పష్టత వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందని పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన మాట వాస్తవమే. కానీ ఆయన బిజెపితో ఉంటారా టిడిపితో ఉంటారా?అనే విషయం వీలైనంత త్వరగా స్పష్టం చేస్తేనే జనసేనకి ప్రజలలో విశ్వసనీయత ఏర్పడుతుంది. లేకుంటే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో ప్రజలలో జనసేన పట్ల అపోహలు, అనుమానాలు నానాటికీ పెరుగుతూనే ఉంటాయి.

జనసేన ఒంటరి పోరాటం చేస్తే వీరమరణం తప్పదని గ్రహించిన్నట్లే ఇప్పుడే పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కాగలరనే భ్రమలో నుంచి కూడా బయటపడి వాస్తవ రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా జనసేన నడుచుకోవడం కూడా చాలా అవసరం. జనసేన పట్ల ప్రజలలో విశ్వాసం, నమ్మకం పెంచుకోగలిగితే మిగిలినవన్నీ వాటంతట అవే వస్తాయి.