Pawan Kalyan జీహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా జనసేనకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మద్దతు తీసుకుంది బీజేపీ. ఆ పార్టీ ప్రముఖులు అడగడంతో పార్టీ అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకున్నారు. అయితే ఇటీవలే ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక ఇంటర్వ్యూ అసలు తమకు జనసేనతో పొత్తు లేదని కుండబద్దలు కొట్టారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచిపనులు ఆకర్షితులై పవన్ కళ్యాణ్ బీజేపీకి జీహెచ్ఎంసి ఎన్నికలలో మద్దతు ఇచ్చి ఉండవచ్చు గానీ పొత్తు అయితే లేదని తేల్చి చెప్పారు. అందుకు ప్రతీకారంగా అన్నట్టు జనసేన పార్టీ పట్టభద్రుల ఎన్నికలలో తెరాస కు మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీ డిజిటల్ టీం ద్వారా ఆ మేరకు ప్రకటన వచ్చింది.

“భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి కుమార్తె శ్రీమతి సురభి వాణీ దేవీ గారు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల MLC ఎన్నికల్లో గెలుపొందాలని @JanaSenaParty తరపున కోరుకుంటున్నాము,” అని ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నుండి గానీ, పార్టీ అధికారిక హేండిల్ నుండి గానీ ఈ మేరకు ప్రకటన ఇప్పటివరకు రాలేదు.

ఈ ఎన్నికలలో బీజేపీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, ఎన్ రామచందర్ రావు బరిలో ఉన్నారు. ఈ ఎన్నిక అటు తెరాసకు ఇటు బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. అటువంటి తరుణంలో జనసేన బీజేపీని దెబ్బ కొట్టడం గమనార్హం. దీనిపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.