Pawan Kalyan JanaSena review meeting on Elections 2019 ఆంధ్రప్రదేశ్ పోలింగ్ ముగిసిన దాదాపు 10రోజుల తర్వాత జనసేన పార్టీ మొదటి సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. తొలి విడత సమీక్షలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

ముఖ్యంగా పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలు, ఈవీఎంల పనితీరుపై నాయకుల అభిప్రాయలు తీసుకుంటున్నారు. అలాగే కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు సరిగా ప్రచారం నిర్వహించలేదనే సమచారం పార్టీకి ఉంది. అభ్యర్థులతో సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని పవన్ ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరిలో పవన్ కళ్యాణ్ వడదెబ్బకు గురి కావడం కూడా పార్టీని ఇబ్బంది పెట్టిందని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నికల తరువాత జనసేన పార్టీ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది.

పవన్ కళ్యాణ్ పోలింగ్ తరువాత కనీసం మీడియాతో మాట్లాడకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. రాష్ట్రంలోని పలు చోట్ల జనసేన ఆఫీసులు మూతపడ్డాయి. హైదరాబాద్ లోని పార్టీ ఐటీ సెంటర్ కూడా మూతబడింది. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చెయ్యడానికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనితో ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఉన్నఫళంగా సమీక్షలు జరుపుతున్నారు. ఈ తంతు రెండు మూడు రోజులలో ముగిసిపోతుందని సమాచారం.