pawan Kalyan Janasena party meetingపవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు జరిగింది. ఏడాదికొక ఉగాది మాదిరిగా పవన్ జనసేన పార్టీ పటిష్టతపై దృష్టి పెడితే పార్టీ సంస్థాగతంగా ఎదగడానికే 25 ఏళ్ల సుదీర్ఘ సమయం పడుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు.

ప్రభుత్వాన్ని “ప్రశ్నించడానికే” పార్టీ పెట్టాను అంటున్న పవన్ కు, ఇప్పుడు ప్రజల నుండి., అభిమానుల నుండి ప్రశ్నల పరంపర మొదలయింది. పార్టీని గ్రామ స్థాయిలో బలపరచడానికి., పార్టీపై ప్రజలలో నమ్మకాన్ని., భరోసాను కల్పించడానికి., ప్రజలలో ఫేమ్ ఉన్న నాయకులను ఆకర్షించడానికి., పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారు అంటూ పవన్ పై ప్రశ్నల వర్షమే కురుస్తుంది.

పవన్ ‘ప్రశ్నించడానికే’ పార్టీ పెట్టినట్టు.., వైసీపీ ప్రభుత్వం ‘ప్రశ్నించబడటానికే’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా పూటకో యాగి., రోజుకో పంచాయతీ., వారానికో వివాదం., నెలకో నిర్ణయం తీసుకుంటూ ఎప్పుడు తాము అలసిపోకుండా.., ప్రతిపక్షాలను నిద్రపోనికుండా రాష్ట్రంలో ఏదొక రచ్చ లేపుతూనే ఉంది.

ఇంత జరుగుతున్నా పవన్ మాత్రం తన పంధా మార్చుకోకపోవడం అటు అభిమానులకు, ఇటు ప్రజలకు అంతుపట్టని విషయం. “గతం గతః” అంటూ కాలం వెల్లబోస్తున్న జనసైనికులు., పవన్ అభిమానులు భవిషత్ పై ఆశలు చావక ప్రభుత్వ దాడులకు బలవుతున్నారు.

కనీసం రానున్న ఈ రెండేళ్లు పవన్ ప్రజల ఆశలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగితే “ప్రశ్నించే స్థాయి నుండి ప్రశ్నలను ఛేదించే స్థాయికి” పవన్ చేరుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కౌలు రైతుల ఆత్మహత్యలకు నిరసనగా., వారి కుటుంబాలకు అండగా పవన్ చేపట్టిన ఓదార్పు యాత్ర వంటి కార్యక్రమాలతో నిత్యం ప్రజల మధ్యే నిలబడాలి. పవన్ నిలబడితేనే ప్రభుత్వంతో కలబడగలుగుతారు.

జనసేన పార్టీ కార్యాలయంలో జరిగే విస్తృత స్థాయి సమావేశాలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను., వైసీపీ ప్రభుత్వ పాలనా విధానాలను., కౌలు రైతుల ఆత్మ హత్యలు., వ్యవసాయ స్థితిగతులు., పెరిగిన విద్యుత్ చార్జీలు., రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను తెలుసుకుని., తద్వారా పార్టీ అనుసరించాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు చేసారు.

జనసేన పార్టీ ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేదని ప్రజలను పల్లకి ఎక్కించడమే తమ లక్ష్యమని., జనసైనికుల మీద వైసీపీ నాయకులకు అంత ప్రేమ అవసరం లేదని., ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చిలనివ్వను అని ఎంతో అలోచించి మాట్లాడానని., వ్యూహాలు నాకు వదిలి, పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేయమంటూ జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. ఇకపై ప్రభుత్వ విధాన నిర్ణయాల మీద జనసేన పోరాటాలు మొదలవుతాయని., అందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలంటూ పవన్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.

పార్టీ కార్యాలయాలలో సమావేశాలు జరిపి జారుకోకుండా పవన్ కార్యాచరణలోకి ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రజల ఆంకాంక్ష. “ఓటమి ద్వారా గెలుపుకు బాటలు” వేసుకున్న జగన్ పట్టుదలను ఆదర్శంగా తీసుకుని పవన్ రాజకీయాలు చేస్తే చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.