Narendra-Modi-Pawan-Kalyanఇంతకాలం జనసేన, టిడిపిలు ఎక్కడ పొత్తులు పెట్టుకొంటాయో అని బెంగపెట్టుకొని వాటిని దూరంగా ఉంచడానికి వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌ని దత్తపుత్రుడు అంటూ రెచ్చగొట్టేవారు. ఆయన కూడా ఆవేశంలో వారికి కావలసినట్లు మాట్లాడేసి దొరికిపోతుండేవారు.

అయితే ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు, పవన్‌ కళ్యాణ్‌ ఘాటు వ్యాఖ్యలతో వెంటనే స్పందించిన బిజెపి అధిష్టానం రాష్ట్రంలో జనసేనతో పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసింది. బిజెపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్ దియోధర్ స్వయంగా ఈ ప్రకటన చేయడంతో వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందని చెప్పవచ్చు.

విజయవాడలో మీడియా సమావేశంలో టిడిపి, జనసేనలు కలిసి పనిచేస్తాయని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ చెప్పినప్పుడు వారిపై నిప్పులు చెరిగిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు సునీల్ దియోధర్ చేసిన ప్రకటనపై కిక్కురుమనకపోవడమే ఇందుకు నిదర్శనం. వైసీపీ నేతలు టిడిపిని, చంద్రబాబు నాయుడుని నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. కానీ బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని ఆవిదంగా అనే సాహసం చేయలేరు. చేస్తే ఏమవుతుందో వారికీ బాగా తెలుసు. అందుకే బిజెపి తాజా ప్రకటనపై వైసీపీ నేతలందరూ మౌనం వహిస్తున్నారనుకోవచ్చు.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ చేసిన తప్పునే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా చేసినట్లు చెప్పవచ్చు. ఏపీలో మొదటి నుంచి బిజెపి, జనసేనలు కలిసి ఉన్నప్పటికీ వాటి మద్య అంత బలమైన సంబందాలు లేవనే సంగతి వైసీపీ నేతలకు కూడా బాగా తెలుసు. కనుక పవన్‌ కళ్యాణ్‌ని రెచ్చగొట్టకుండా ఊరుకొని ఉంటే ఆయన టిడిపివైపు చూసేవారే కారేమో? కానీ జనసేన, టిడిపిలు ఎక్కడ పొత్తులు పెట్టుకొంటాయో అని ఆందోళన చెందుతూ వాటిని దూరంగా ఉంచేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీ ఎమ్మెల్యేల వరకు ఆయనను పదేపదే దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ రెచ్చగొట్టి చివరికి చంద్రబాబు నాయుడుకి సన్నిహితం చేశారు. దాంతో జనసేనతో తమ సంబంధాలు చెడిపోకుండా కాపాడుకోవడానికి బిజెపి అధిష్టానం స్వయంగా రంగంలో దిగింది.

ఇప్పుడు జనసేనతో కలిసి జగన్ ప్రభుత్వంపై పోరాడేందుకు బిజెపి సిద్దం అవుతోంది. అంటే అక్కడ తెలంగాణ సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి చేజేతులా బిజెపిని తెచ్చిపెట్టుకొని బాధపడుతున్నట్లే, ఇక్కడ సిఎం జగన్ కూడా పవన్‌ కళ్యాణ్‌ను పదేపదే రెచ్చగొట్టి, వేధించి చివరికి చంద్రబాబు నాయుడు దరికి చేర్చడం ద్వారా బిజెపి రంగంలో దిగేలా చేసుకొన్నారని చెప్పవచ్చు.

జనసేనతో బిజెపి పొత్తులు కొనసాగించడమంటే, అమరావతిని రాజధానిగా అంగీకరించాలి. వైసీపీ ప్రభుత్వంపై జనసేనతో కలిసి పోరాడుతూ దానిని గద్దె దించడానికి సిద్దపడాలి. ఈ రెంటికీ బిజెపి సిద్దపడింది కనుకనే జనసేనతో పొత్తులను వదులుకోకూడదని నిర్ణయించుకొంది. కనుక టిడిపి స్థానంలో కేంద్ర ప్రభుత్వం అండదండలున్న బిజెపిని కొని తెచ్చుకొన్నట్లయింది.

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వెనుక బిజెపి దాని వెనుక… కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కనుక ఇకపై వైసీపీ నేతలు ఆయనపై నోరు జారినా, జనసేన కార్యకర్తలను వేధించాలని ప్రయత్నించినా బిజెపి కూడా స్పందిస్తుంటుంది. బహుశః వైసీపీ నేతలకి ఈపాటికి ఇది అర్దమయ్యే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, బలహీనంగా ఉన్న జనసేన, బిజెపిల బందాన్ని మళ్ళీ ధృడపరిచిన క్రెడిట్ వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది.