Pawan Kalyan Janasena Narasapuram speechదేశంలో ఎక్కడా లేని జీవో నెంబర్ 217 ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అమలు జరుగుతోందని, జనసేనకు గనుక ఒక్క 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ జీవోను ఇచ్చే ధైర్యం చేసి ఉండేది కాదని, లక్షల మంది పొట్ట కొడుతోన్న ఈ జీవో ప్రతులను చించివేసిన తనపై వైసీపీ నేతలు కేసులు పెట్టుకోవచ్చని ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.

‘మత్స్యకార అభ్యున్నతి సభ’ పేరుతో నరసాపురం వేదికగా పవన్ కళ్యాణ్ అధికార పార్టీ తీరును ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేసారు. ముందుగా తాను మత్స్యకారుల సభకు విచ్చేయడానికి రోడ్లంతా గుంతలు, గొయ్యిలతో తగిన విధంగా వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసిందని, దాంతో పడవ ప్రయాణం చేసినట్లుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇది చక్కని అభివృద్ధి, ఈ ప్రయాణంతో ‘మాయాబజార్’ సినిమాలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే పాట గుర్తొచ్చింది జగన్ సర్కార్ ను ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో 32 మత్స్యకార ఉపకులాలు ఉన్నాయని, 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని, మీ కష్టాలు తనకు తెలుసని, అందుకే జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని అన్నారు.

పార్టీ అధినేతగా కార్యకర్తల కుటుంబాలను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తా, కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేసే నిర్ణయాలు తీసుకోను. మా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, ఇదే విధంగా హింసిస్తే రోడ్డుపై ఏ స్థాయికైనా దిగి పోరాడతా. జనసేనను బెదిరించాలని చూసే వారికి ఒకటే చెబుతున్నా… మీ పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన భయపడదు, సంయమనం పాటిస్తున్నానంటే అది తమ బలం అని, బలహీనత కాదని ఉద్ఘాటించారు.

“వైసీపీకి 151 ఎమ్మెల్యేలు ఇచ్చింది చికెన్ కొట్లు, మటన్ కొట్లు, చేపల కొట్లు పెట్టుకోడానికా? ఈ మాట మీరు ఎన్నికల ముందే చెప్పాల్సింది కదా” అంటూ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మీ కోసం అవసరమైతే జైలుకు వెళ్తా, క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాను, ఇందులో ఏ మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేసిన పవన్, మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాబోయే ఎన్నికల గురించి స్పష్టంగా చెప్తానని అన్నారు.

ఈ జీవో నెంబర్ 217ను తక్షణం వైసీపీ సర్కార్ వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ అలా తీసుకొని పక్షంలో 2024లో జనసేన అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపునే ఈ జీవోను రద్దు చేస్తుందని ప్రకటించారు. పరోక్షంగా రాబోయేది జనసేన సర్కార్ అన్న వ్యాఖ్యలను బలంగా తన అభిమానులకు, జనసైనికులకు పంపించే విధంగా పవన్ ప్రసంగం ఉండడం గమనించదగ్గ పరిణామం.