pawan-kalyan-janasena-mla-rapakaతమ పార్టీ నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైఖరితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విసిగిపోయినట్టుగా కనిపిస్తుంది. పార్టీ ఆదేశాలను అడుగడుగునా ధిక్కరిస్తున్న ఆయనను ఇక వదిలించుకోవడమే మేలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. వరప్రసాద్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు.

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని పార్టీలోని అన్ని స్థాయిలలో నిర్ణయం తీసుకున్నామని.. దానికి అనుగుణంగానే సభలో వ్యవహరించాలని లేఖలో కోరారు. ప్రభుత్వ పాలన సంపూర్ణంగా అమరావతిలోనే కొనసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పార్టీలో జరిగిన సమావేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.

ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులను ఇవాళ్టి సమావేశాల్లో ప్రవేశ పెడుతున్న సందర్భంగా వాటిని వ్యతిరేకించాలని తెలిపారు. సమావేశాలకు హాజరై, రెండు బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో ఓటింగ్‌కు హాజరై.. పార్టీ నిర్ణయానుసారం వ్యతిరేకించాలని రాపాకను లేఖలో పవన్ కోరారు.

రాపాక జనసేన ఆదేశాన్ని ధిక్కరించి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తే… ఆయనను స్పీకర్ చేత అనర్హుడిగా ప్రకటించేందుకు పవన్ కళ్యాణ్ సిద్దపడుతున్నారు. దీనితో ఈ బహిరంగ లేఖ పార్టీ విప్ గా ఉండబోతుంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ తమ రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు అందరి ఎమ్మెల్యేలకు విప్ జరీ చేసిన సంగతి తెలిసిందే.