జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అర్ధరాత్రి ఇన్నర్‌రింగ్‌ రోడ్‌లోని ఆఫీస్‌పై మద్యం బాటిళ్ళతో దాడికి తెగపడ్డారు. ఈ ఘటనలో కార్యాలయం అద్దారు పగిలిపోయాయి. ఈ కార్యాలయాన్ని రెండు వారాల క్రితమే పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆఫీసు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి, అగంతకులను నిలువరించడానికి ప్రయత్నించారు. దీనితో దుండగులు అక్కడ నుండి పరారయ్యారు. స్థానిక పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

బిల్డింగులో అందుబాటులో ఉన్న సీసీటీవీ విజువల్స్, పక్కనే ఉన్న బిల్డింగులలో ఉన్న సీసీటీవీ విజువల్స్ ను కూడా పరిశీలిస్తున్నారు. దీని బట్టి దాడి చేసిన దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు జనసేన కార్యకర్తలు దీనిపై మండిపడుతున్నారు. తమ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేకే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఇది పిరికిపందేల చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే దుండగులు ఎవరో ఇప్పటివరకూ పోలీసులు, ఆఫీసు స్టాఫ్ కూడా నిర్ధారించనప్పటికీ టీడీపీ వారే అని కొందరు జనసేన కార్యకర్తలు నిర్ధారణకు వచ్చేశారు.

దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనికి వైఎస్సాఆర్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీతో పొత్తుకు కాదు అన్న కారణంగానే అధికార పార్టీ వారు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి దాడికి పాల్పడింది ఎవరైనా కావొచ్చు. తెలుగుదేశం వారూ కావొచ్చు. కాకపోతే నిజానిజాలు నిర్ధారణ కాకుండా ఎవరో ఒకరిని అనేస్తే అసలు నిందితులు తప్పించుకుంటారు. ఇలాంటి ఆధారం లేని ప్రచారం వల్ల రాజకీయ పార్టీ కార్యకర్తల మధ్య మనస్పర్థలు వచ్చి లేని పోని గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది.