Pawan Kalyan  Janasena  -Glass Tumblerజనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో జనసేన వర్గాలలో హర్షం వ్యక్తం అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎర్ర తుండు, గాజు గ్లాసును సామాన్యుడికి కనెక్టు కావడానికి పవన్ కళ్యాణ్ సినిమాలలోనూ రాజకీయాలలోనూ విరివిగా వాడుతున్నారు. ఈ క్రమంలో గాజు గ్లాస్ గుర్తుగా రావడం శుభపరిణామం అని పార్టీ వర్గాలు ఆనందపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు రెండు సార్లు ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు.

అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పటివరకు జనసేన వర్గాలు చేసిన అన్వేషణలో ఎన్నికల కమిషన్ కేటాయించే పలు గుర్తులు గాజు గ్లాసును పోలి ఉండడం గమనార్హం. తబలా, బక్కెట్, కప్ సాసర్, గ్యాస్ సిలిండర్, పెన్ స్టాండ్ గుర్తులు కొంచెం ఇంచుమించుగా గాజు గ్లాసునే పోలి ఉంది. దీనితో పెద్దలు నిరక్షరాస్యులు పొరపాటుపడే అవకాశం మెండుగా ఉంది. దీనితో దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యాలని, రెండు తెలుగు రాష్ట్రాలలో గాజు గ్లాసు పోలిన గుర్తులను కేటాయించకుండా చూడాలని ప్రయత్నం చెయ్యాల్సిన పరిస్థితి.

అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళాల్సి రావొచ్చు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో తెరాసకు చెందిన కారు గుర్తుని పోలి ఉన్న ట్రక్ గుర్తు కు దాదాపుగా రెండు లక్షల ఓట్లు వచ్చాయి. ఈ గందరగోళం వల్ల రెండు సీట్లు కోల్పోయింది అధికార పార్టీ, ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి కాబట్టి సరిపోయింది. అదే హోరాహోరీగా జరిగి ఉంటే ఈ రెండు లక్షల ఓట్ల ప్రభావం తీవ్రంగా ఉండేది. ఇప్పుడు దీనిని తెరాస ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్తుంది. గాజు గ్లాసును పోలిన గుర్తులు నాలుగు ఉండటం అంటే ఎన్నికల కమిషన్ వద్ద వాటిని తీయించడం అంత తేలికేమీ కాదు.

దీనికంటే జనసేన తన గుర్తును మార్చుకోవడమే శ్రేయస్కరం. అయితే పవన్ కళ్యాణ్ అందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి. మూడు బలమైన పార్టీలు పోటీ చేసే ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు మారిపోతాయి. ఇలాంటి సందర్భంలో ఇటువంటి లోపాలు ఏమైనా జరిగితే ఇబ్బందే. జనసేన వంటి కొత్త పార్టీకి ఇటువంటి ఇబ్బంది రావడం ఇబ్బందే. ఆదిలోనే ఎన్నికల కమిషన్ తో లడాయికి వెళ్లాల్సిన పరిస్థితి. దీని నుండి పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి.