ఇటీవలే దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించి సంచలనం సృష్టించిన బీజేపీ అదే విజయం జీహెచ్ఎంసి ఎన్నికలలో కూడా సాధించి తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ఈ ఎన్నికలలో పోటీ చెయ్యాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తలపోటుగా పరిణమించింది.

“తెలంగాణలో జనసేన ప్రాబల్యం తక్కువే. అందుకే దుబ్బాకలో ఆయన్ని ప్రచారానికి వాడుకోలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో సెటిలర్ల ప్రాబల్యం ఉన్న చోట్ల పవన్ కళ్యాణ్ మద్దతు అవసరం అవుతుంది. అయితే దాని కోసం ఆయనకు 10-20 సీట్లకు మించి ఇవ్వలేం… అన్ని తక్కువ సీట్లకు ఆయన ఒప్పుకుంటాడా అనేది అనుమానం,” అని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

“ఈ ఎన్నికలు తెరాస.. బీజేపీ మధ్యే జరిగే ఎన్నికలు. సెట్లర్ అనే ఫ్యాక్టర్ పెద్దగా పని చెయ్యకపోవచ్చు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకూ ఉపయోగం అనేది తెలియదు. అయితే జనసేనని ఎన్నికల నుండి తప్పించాలి లేదా తక్కువ సీట్లకు ఒప్పించాలి. విడిగా పోటీ చేస్తే మాత్రం తప్పుడు సంకేతాలు వెళ్తాయి,” అని వారు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ని నొప్పించే పరిస్థితి కూడా బీజేపీకి ఉండదు. అయితే ఈ ఎన్నికలు ఆ పార్టీకి అతిపెద్ద అవకాశం కావడంతో అసలు తెలంగాణలో నిర్మాణమే లేని జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి ఇబ్బందికరమే. డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.