pawan-kalyan-janasena-future-politics-tdp‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు పెడుతూ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బిజెపిని మరియు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును తీవ్రంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ తొలి సభ తిరుపతి నుండి మొన్నటి అనంతపురం వరకు పెట్టిన సభలలో… పేరుకు ‘ప్రత్యేక హోదా’ అని పెట్టినా… సమకాలీన వర్తమాన రాజకీయాలను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.

ఇక, ప్రత్యేక హోదా విషయానికి వస్తే… హోదా స్థానంలో ఇస్తున్న ప్యాకేజ్ ఎప్పుడు వచ్చేను? అవి ఎవరి జేబుల్లోకి వెళ్ళేను? అంటూ విమర్శలు చేస్తూనే… అసలు ఆ ప్యాకేజ్ కైనా చట్టబద్ధత ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయగా, ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చింది.

అయితే తాజాగా ఆర్ధికమంత్రితో భేటీ అయిన సుజనా చౌదరి ‘చట్టబద్ధత’ విషయాన్ని ఖరారు చేసారు. చట్టబద్ధతకు సంబంధించిన ఫైల్ ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలకు పంపిందని, వచ్చే వారంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టత ఇచ్చారు. దీంతో ‘ప్రత్యేక హోదా’ విషయంలో జరిగిన అన్యాయం ‘ప్యాకేజ్’ విషయంలో జరగదని అన్నారు.

తాజా పరిణామాలతో రాష్ట్ర యంత్రాంగం సంతోషం వ్యక్తం చేస్తుండగా, తదుపరి సమావేశం పెడితే ‘జనసేన’ అధినేత ఏ విధంగా ప్రశ్నించగలరు? అనే ఆసక్తికరమైన అంశం కూడా తెరపైకి వచ్చింది. ‘ప్యాకేజ్’ విషయంలో పవన్ ప్రశ్నించిన చట్టబద్ధత కల్పించేసిన పక్షంలో… పవన్ ప్రశ్నించడానికి వేరే అంశం ఏముంటుంది? మళ్ళీ ప్రత్యేక హోదా అన్నా కూడా… అది వెంకయ్య నాయుడు అన్నట్లుగా ‘అవుట్ ఆఫ్ సిలబస్’గా మారిపోయింది. దీంతో ‘జనసేన’ అధినేత ఏ రూటు తీసుకుంటారో చూడాలి.