Pawan kalyan delaying on janasena contestantsఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అందరి చూపు జనసేన మీదకే వెళ్ళింది. ఎన్నికలకు కేవలం ఒక్క నెల మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల లిస్టు మీద కసరత్తు చేసాయి. వందకు పైగా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. అయితే జనసేనలో మాత్రం ఇప్పటివరకు కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం కూడా ఖరారు కాలేదు. దీనితో అసలు జనసేన 175 స్థానాలలో పోటీ చేస్తుందా అనే అనుమానాలు వచ్చాయి.

కొందరైతే ఏకంగా జనసేన పోటీ నుండి తప్పుకుంటుందేమో అని అనుమాన పడ్డారు. క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో నిరాశపడిపోయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తమ మొదటి లిస్టు తయారు అయ్యిందని ప్రకటించి ఊరట నిచ్చారు. తోలి విడత జాబితాలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు వామపక్ష పార్టీలు తమకు 26 శాసనసభ, 4 లోకసభ స్థానాలను కేటాయించాలని ఒక లిస్టు పవన్ కళ్యాణ్ కు అందించాయి.

ఏ నియోజకవర్గాల్లో తమకు బలముందో తెలిపే వివరాలను పవన్‌ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాయి. ఇది ఇలా ఉండగా అసలు జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చెయ్యాలనేదాని పై ఇంకా పార్టీ ఒక నిర్ణయానికి రాలేనట్టు తెలుస్తుంది. పౌరుషానికి పోయి ఎక్కువ చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోతే పార్టీ దీర్ఘ కాలికంగా నిలబడదని కొందరి అభిప్రాయం. అసలు 175 చోట్ల పోటీ చెయ్యకపోతే ఈ ఎన్నికలలోనే తమను ఎవరూ సీరియస్ గా తీసుకోరని మరి కొందరు అనుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో పోటీ పై కూడా సందిగ్దత నెలకొంది.

అక్కడ ఏదో పేరుకి అభ్యర్థులను పెట్టినా పవన్ కళ్యాణ్ వెళ్లి ప్రచారం చేసే పరిస్థితి కనపడటం లేదు. పైగా పూర్తి స్థాయిలో తెరాస వేవ్ కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ పోటీ చెయ్యడం అవసరమా అని ఆలోచన చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తనను తానే నిందించుకోవాల్సిన పరిస్థితి. ఐదు సంవత్సరాలు ఉండగా చివరి ఏడాది కి మాత్రమే బయటకు వచ్చారు. జనసేన పోరాట యాత్ర అంటూ మొదలు పెట్టి దానిని కూడా సీరియస్ గా తీసుకోలేదు. దీనితో ఐదు సంవత్సరాల తరువాత కూడా టైమ్ సరిపోలేదు అనుకోవాల్సి పరిస్థితి.